విద్యార్థి జీవితంతో టీచర్స్ ఆటలు.. టెన్త్ లో 82 మార్కులొస్తే 18 మార్కులు వేశారు!

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి విజ్ఞానాన్ని బోధించి సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. అందుకే గురువులను త్రిమూర్తులతో పోల్చి గౌరవిస్తుంటారు. ఒకప్పుడు మహరాజులు కూడా తమ పిల్లలను గురువులపై నమ్మకం ఉంచి ఆశ్రమాల్లో ఉంచేవారు. అంత గొప్ప గురువు స్థానం ఈ మధ్య కొంతమంది అప్రదిష్టపాలు చేస్తున్నారు. గురువు స్థానానికి మచ్చ తెస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు స్కూల్ కి మద్యం సేవించి వస్తున్నారు, సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. తాజాగా టీచర్ల నిర్లక్ష్యం చేసిన నిర్లక్ష్యం ఓ విద్యార్థిని మానసికంగా కృంగదీసింది. వివరాల్లోకి వెళితే..


ఈ మధ్య కాలంలో పదవ తరగతి పరీక్ష పేపర్లు దిద్దడంలో లోపభూయిష్టమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేపర్లు దిద్దే టీచర్లు చేస్తున్న నిర్లక్ష్యం విద్యార్థులకు తీవ్రమైన నష్టాన్ని తెస్తుంది. ఆ మధ్య అన్ని సబ్జెక్టుల్లో 100 కు 96 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి ఓ విద్యార్థికి 40 మార్కులు వేశారు. రీవాల్యుషన్ అప్లై చేస్తే 96 మార్కులు వచ్చినట్లు చూపించారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.ఉపాధ్యాయులు చేసే తప్పిదాల వల్ల విద్యార్థులు పడే మనోవేదన వర్ణణాతీతం. తాజాగా అలాంటి ఘటన బత్తలపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాఘవపల్లి గ్రామానికి చెందిన గోగుల సూర్యనారాయణ కొడుకు అంజి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. మార్చిలో బత్తులపల్లిలోని జడ్పీహెచ్ఎస్ కేంద్రంగా పబ్లిక్ పరీక్షలు రాశాడు.

ఇటీవల వచ్చిన మార్కుల ప్రకారం తెలుగులో 98, హిందీ 98, మ్యాథ్స్ 92, భౌతిక శాస్త్రం 87, సాంఘిక శాస్త్రం లో 86 మార్కులు వచ్చాయి. కానీ ఇంగ్లీష్ లో మాత్రం 18 మార్కులు రావడంతో అంజితో సహా అందరూ షాక్ అయ్యారు. మెరిట్ విద్యార్థి అయిన అంజి ఫెయిల్ కావడం ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోయారు. మానసికంగా కృంగిపోతున్న అంజికి ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ ధైర్యం చెప్పి వెంటనే రీ వేరిఫికేషన్ దరఖాస్తు చేశారు. ఈ ఫలితాలు సోమవారం వెలువడగా మ్యాథ్స్ లో 100 కు 82 మార్కులు వచ్చాయి. ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కొడుకుకి తక్కువ మార్కులు రావడంతో తీవ్ర నరకాన్ని అనుభవించాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి తప్పిదాలు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని విద్యాశాఖాధికారులను కోరారు.