తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలకు శుభవార్త..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ప్రకటించినట్లుగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.


ఆధార్, ఓటర్ ఐడీ వంటి స్థానిక చిరునామా ఉన్న కార్డులను చూపిస్తే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీలో రద్దీ విపరీతంగా పెరిగింది. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లిందంటున్నారు. ఈ క్రమంలో ఉచిత ప్రయాణానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇకపై ఆధార్ కార్డు లేకుండా కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ వివరాలు..

మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రయాణం కోసం రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ప్రత్యేక కార్డులు ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం.. సెంటర్‌ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) తో ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు.

ప్రతి ఒక్క మహిళకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాల కోసం ఇచ్చే కార్డులు.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు చేరాలని భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్డు చూపిస్తే చాలని.. ఆధార్ కార్డు అవసరం లేదని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీలో పీఎఫ్ బకాయిలు రూ.1400 కోట్లు ఉండగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే రూ.660 కోట్లకు తగ్గించామని తెలిపారు. అలాగే సీసీఎస్ బకాయిలు గతంలో రూ.600 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.373 కోట్లకు తగ్గిందన్నారు.

పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్‌కు 2,800 ఈవీ బస్సులు వస్తాయని తెలిపారు. అలానే నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు కూడా 100 చొప్పున ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో వీటికి చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి భట్టి సూచించారు. మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వం అందించిన సహకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.