తెలుగు రాష్ట్రాలు గజగజ.. చలితో పాటు భారీ వర్షాలు.. బయటకు రావొద్దు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ చలి విపరీతంగా పెరుగుతోంది. అలాగే పలు చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో చలితో పాటు వర్షాలు పడుతున్నాయి.


నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నెమ్మదిగా కదులుతోంది. గత ఆరు గంటలలో ఈ తుఫాను గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఈ తుఫాను పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..

దిత్వా తుఫాను ఎల్లుండి (ఆదివారం) పుదుచ్చేరి తీరానికి చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా తీవ్రంగా ఉంటుంది. రేపు, ఎల్లుండి కోస్తా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుఫాను కదలికపై వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

తెలంగాణలో ఇది పరిస్థితి..

తెలంగాణ రాష్ట్రంలోనూ చలి తీవ్రత మళ్లీ పెరగనుంది. ఈ నెల 28 రాత్రి నుండి 30 వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తిరిగి 9 నుండి 11°C వరకు పడిపోవచ్చు. రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు 11 నుండి 14°C మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర ప్రజలు చలి తీవ్రత నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 2 నుండి 5 వరకు రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉండవచ్చు.

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు: ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు.

తేలికపాటి వర్షాలు: వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కేవలం తేలికపాటి జల్లులు పడవచ్చు.

మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతులు తమ పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రజలు చలి, వర్షాల నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కీలక సూచనలు తెలియజేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.