TG EAPCET 2024 Counselling: నేటితో ముగుస్తున్న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ స్లాట్‌ బుకింగ్‌ గడువు.. జులై 19న సీట్ల కేటాయింపు

www.mannamweb.com


తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌ సీట్ల భర్తీకి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకునే గడువు నేటితో (జులై 12వ తేదీ) ముగుస్తుంది. అలాగే ఈ రోజు గడువు సమయం ముగిసేలోపు ప్రాసెసింగ్‌ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. జులై 10వ తేదీరకు 97,309 మంది స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. వారిలో 33,922 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఓ విద్యార్థి అత్యధికంగా 942 ఆప్షన్లు ఇచ్చినట్లు ఈఏపీసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా జులై 19న ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. జులై 19 నుంచి జులై 26 వరకు సీట్లు పొందిన కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. జులై 26 నుంచి ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. జులై 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జులై 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదు, జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. మూడో విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 9న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదు, ఆగస్టు 13న మూడో విడత సీట్ల కేటాయింపుతో పాటు అదే రోజు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ డీఈఈసెట్‌ పరీక్ష.. 86 శాతం మంది హాజరు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జులై 10న డీఈఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 85.96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక ‘కీ’ జులై15వ తేదీలోపు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ గ్రూప్‌-4 వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు మొదలైన ధ్రువపత్రాల పరిశీలన

తెలంగాణ గ్రూప్‌ 4లో ఎంపికైన అభ్యర్ధుల్లో వినికిడి లోపం ఉన్న వారికి జులై 11 నుంచి సెప్టెంబరు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. హైదరాబాద్‌ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మెడికల్‌ బోర్డు ఎదుట హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఓ ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ గ్రూపు 4 హాల్‌టికెట్, మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, విద్యార్హత సర్టిఫికెట్లు తమతోపాటు తీసుకురావాలని సూచించింది.