నేటి సమాజంలో కార్పొరేట్ పాఠశాలలు తల్లిదండ్రుల దగ్గర ఎంతటి భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. అంతటి ఫీజులను చెల్లించినా స్కూల్‌లో సరిగ్గా పాఠాలు చెబుతారన్న నమ్మకం లేదు. ఇదిలా ఉంటే మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల సంగతి ఇక అసలు చెప్పకరలేదు. అంతటి దయనీయ స్థితిలో అవి ఉంటాయి. వాటిలో సౌకర్యాలు అసలే ఉండవు. ఇక ఉపాధ్యాయుల సంగతి చెప్పకరలేదు. ఉన్నవారు సరిగా పాఠాలు చెప్పరు. కొన్నింటిలో అసలు ఉపాధ్యాయులే ఉండరు. ఇదంతా ప్రభుత్వ పాఠశాలల్లో మామూలే. కానీ కర్ణాటక రాష్ట్రంలోని ఆ పాఠశాలలో మాత్రం అలా కాదు. ఉన్నది తానొక్క ఉపాధ్యాయుడే అయినా, దూరంగా విసిరేసినట్టు ఎక్కడో పర్వత ప్రాంతంలో ఉన్నా ఆ స్కూల్‌కు వచ్చే స్థానిక పిల్లల కోసం ఆ టీచర్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. ఎంతగా అంటే నిత్యం కొన్ని కిలోమీటర్ల పైకి పర్వతం ఎక్కుతూ. అదీ కాలి నడకన… అవును, మీరు విన్నది నిజమే.కర్ణాటక రాష్ట్రంలోని గజేంద్రగడ తాలూకా బైరపుర గ్రామంలో సురేష్ బి చలగెరి అనే ఓ 50 ఏళ్ల ఉపాధ్యాయుడికి స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో గత కొన్నేళ్ల కింద పోస్టింగ్ లభించింది. అయితే అతను మొట్ట మొదటి సారి ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి స్కూల్‌ను చూసి ఒకింత ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, ఆ స్కూల్‌కు ఎలా వెళ్లాలా అని ఆలోచించాడు. ఎందుకంటే ఆ పాఠశాల బైరపుర గ్రామంలో ఉన్న ఓ పర్వత ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కొంత మంది గిరిజన వాసులు నివసిస్తున్నారు. వారి పిల్లలే ఆ పాఠశాలలో చదువుకుంటారు. ఈ క్రమంలో పర్వత ప్రాంతంలో ఉన్న ఆ పాఠశాలకు వెళ్లాలంటే సురేష్‌కు మొదట్లో ఇబ్బందిగా అనిపించేది. ఎందుకంటే అక్కడికి వెళ్లాలంటే కాలి నడకనే 8 కిలోమీటర్ల పాటు పైకి ఎక్కాల్సి ఉంటుంది. వేరే ఇతర రవాణా సౌకర్యాలు అక్కడ లేవు. దీంతో కష్టమైనా ఆ పిల్లలకు చదువు చెప్పేందుకు ఆ బాటనే 8 కిలోమీటర్ల పాటు నడిచి వెళ్లి వస్తుంటాడు. కాగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మధ్యాహ్న భోజన పథక సరుకులను కూడా అతనే స్వయంగా పాఠశాలకు రోజూ తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆ స్కూల్లో అతను తప్ప వేరే ఎవరూ ఉండరు. అంటే ఆ స్కూల్‌కు హెడ్ మాస్టర్, ఉపాధ్యాయుడు, డ్రిల్ మాస్టర్, వంట మనిషి, క్లర్క్ అన్నీ అతనే.
అలా సురేష్ రోజూ సరుకులన్నింటినీ 8 కిలోమీటర్ల పాటు మోసుకెళ్లి ఆ స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెబుతూ వారికి వంట వండి భోజనం పెడుతూ మళ్లీ సాయంత్రం వేళ కింద ఉన్న తన ఇంటికి చేరుకుంటాడు. ఇదీ అతని దినచర్య. అయినా సురేష్ తన బాధ్యతను ఎన్నడూ మరువలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే సోమరిపోతు ఉపాధ్యాయులందరికీ సురేష్ ఇప్పుడు ఓ సమాధానంలా నిలుస్తున్నాడు. అంతేగా మరి! చివరిగా ఇంకో విషయం… సురేష్ శ్రమను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఆ పాఠశాలకు ఇటీవలే మరో ఇద్దరు టీచర్లను ఏర్పాటు చేసింది. అంతేకాదు స్కూల్ కోసం ఓ టూ వీలర్‌ను కూడా అందజేసింది. ఈ విషయంలో నిజంగా సురేష్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే… కదా!