బాబోయ్ ఏవో పనులు ఉన్నాయి అని.. కాస్త ఉదయం నిద్రలేవడానికి అలారం పెట్టుకుంటే.. ఇది డెంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిజం భయ్యా.. ఇకపై అలారంలో మోగేవి మామూలు బెల్స్ కావు..
డెంజర్ బెల్స్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల ఈ మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో షాకింగ్ అంశాలు వెలుగుచూశాయి. ఇంతకీ ఏంటా డెంజర్ బెల్స్ అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గుండె పోటుకు గంటలు మోగుతున్నాయ్..
పొద్దుపొద్దున్నే వినిపించే అలారం మోతతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ముప్పును పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్లు చేసిన అధ్యయనంలో వెలుగుచూసింది. ఈసందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. 32 మందిపై ఈ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. రెండు రోజులపాటు వారంతా నిద్రలో స్మార్ట్ వాచ్లు, ఫింగర్ బ్లడ్ ప్రెజర్ కఫ్స్ ధరించి పాల్గొన్నారని చెప్పారు. మొదటిరోజు ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్రలేవమని ఆ 32 మందికి సూచించినట్లు పేర్కొన్నారు. రెండోరోజు.. ఐదు గంటలకు పైగా నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకొని లేవమని చెప్పి, ఈ రెండు ఫలితాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయన్నారు. సహజంగా, బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్ ప్రెజర్‌లో పెరుగుదలను గుర్తించినట్లు తెలిపారు.
సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ రక్తపోటు పెరుగుదల నిద్ర తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడించారు. అలారం శబ్దం శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుందని, ఆ స్పందన కారణంగా కార్టిసోల్, అడ్రినలిన్ విడుదల అవుతుందన్నారు. ఈ హార్మోన్లు గుండె వేగాన్ని పెంచుతాయని, రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయని చెప్పారు. అవి బీపీని పెంచేందుకు కారణమవుతున్నాయని గుర్తించినట్లు వెల్లడించారు. నిద్రలేవగానే ఇలా బీపీ పెరగడాన్ని మార్నింగ్ బ్లడ్ ప్రెజర్ సర్జ్ అని పిలుస్తారని చెప్పారు. ఇలా ఉదయం పూట అలారంతో బీపీ పెరగడం తాత్కాలికమే అయితే ప్రమాదం లేదు కానీ.. కానీ తరచూ అదే పరిస్థితి ఎదురయితే.. మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారికి ప్రమాదకరమని వెల్లడించారు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం ద్వారా అలారాన్ని దూరంగా ఉంచొచ్చు అని సూచిస్తున్నారు.



































