జడ్చర్ల మండల పరిధిలోని కోడ్గల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ లు అరెస్ట్ కావడంతో వారికి సంబంధించిన మరిన్ని బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.
వారు పాఠశాలలో విద్యార్థులతో చేయించిన వెట్టి చాకిరి పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు శుక్రవారం బయటపడ్డాయి. ఇన్నాళ్లు వారి ఆగడాలను పంటి బిగువున భరించిన విద్యార్థినిలు వారు తాము త్రవుకున్న గోతిలో తామే పడటంతో వారి పీడ విరగడయిందని సంబరపడుతున్నారు. వారి హయాంలో పాఠశాలలో విద్యార్థినులు నరకం అనుభవించినట్లుగా తెలుస్తోంది. వారు పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ గా కొనసాగినంత కాలం పాఠశాలలో విద్యార్థినిలతో అనేకమైన వెట్టి చాకిరి పనులు చేయించినట్టు సమాచారం.
పాఠశాలలో తరగతి గదులను పరిశుభ్రం చేయడం, వంట మనుషులకు సహాయం చేయడం, గిన్నెలు తోమడం, ప్రిన్సిపల్ కారు కడగడం వంటి పనులు విద్యార్థినిలు చేసినట్లుగా ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ల ఆగడాలను గురించి తమ తల్లిదండ్రులకు తెలిపితే ఎక్కడ తమకు వారు హాని తలపెడతారోననే ఉద్దేశంతో ఇన్నాళ్లు చిన్నారులు వారి ద్వారా పడిన బాధను తమలోనే దాచుకుని మదనపడ్డారు. ఇక వారు శాశ్వతంగా పాఠశాలకు దూరం కావడంతో ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో చర్చిస్తే, వారి ఆగడాలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.


































