భారతదేశం అనగానే విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రకృతి సోయగాలు గుర్తుకు వస్తాయి. దేశంలోని ప్రతి ప్రాంతం తనదైన ప్రత్యేకతతో పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ముఖ్యంగా శీతాకాలం (వింటర్ సీజన్) పర్యటనలకు అనువైన కాలంగా భావిస్తారు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు, ప్రకృతి అందాలు మరింత ఆకట్టుకుంటాయి. వింటర్ సీజన్‌లో తప్పక సందర్శించాల్సిన కొన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలపై ఓ లుక్కేద్దాం.
మంచు అందాలను ఆస్వాదించాలనుకునే వారికి జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్ ఉత్తమ గమ్యస్థానంగా నిలుస్తోంది. చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు, విశాలమైన లోయలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. గుల్మార్గ్‌లో స్కీయింగ్, స్నో బోర్డింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కేబుల్ కార్‌లలో ఒకటైన గోండోలా రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే దాల్ సరస్సులో బోటింగ్ చేయడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్ శీతాకాలంలో ప్రశాంత వాతావరణంతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. గంగా నది తీరంలో ఉన్న ఈ పట్టణాలు ఆధ్యాత్మిక పర్యటనకు ప్రసిద్ధి. సాయంత్రం వేళ జరిగే గంగా హారతి భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని అందిస్తుంది. అంతేకాదు, రిషికేశ్‌లో రివర్ రాఫ్టింగ్, బంజీ జంపింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా విస్తృతంగా లభిస్తాయి. హరిద్వార్‌లో మానసా దేవి, చండీ దేవి ఆలయాలకు వెళ్లే రోప్‌వే ప్రయాణం మరో ప్రత్యేక ఆకర్షణ.
ప్రకృతి ప్రేమికుల కోసం కేరళలోని మున్నార్, అలప్పుజ ప్రాంతాలు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. మున్నార్ చుట్టూ విస్తరించిన టీ తోటలు, చల్లని వాతావరణం హిల్ స్టేషన్ అనుభూతిని అందిస్తాయి. అలప్పుజలో బ్యాక్‌వాటర్స్ మధ్య హౌస్‌బోట్ క్రూయిజ్‌లు పర్యాటకులకు ప్రత్యేక అనుభవాన్ని ఇస్తాయి. హౌస్‌బోట్‌లో రాత్రి బస చేస్తూ కేరళ సంప్రదాయ వంటకాలను ఆస్వాదించడం టూర్‌ను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది.
బీచ్‌లపై వాటర్ స్పోర్ట్స్, సీ ఫుడ్, పురాతన చర్చిలు, సన్‌రైజ్-సన్‌సెట్ పాయింట్లు గోవాను దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ఫేవరెట్ డెస్టినేషన్‌గా నిలబెడుతున్నాయి.































