టాటాకు నిద్రపట్టకుండా చేసిన కారు.. ఇన్‌స్పైర్ ఎడిషన్ రిలీజ్.. కేవలం 300మందికే ఛాన్స్.. ధర కూడా తక్కువే

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ఎంజీ విండ్సర్ ఈవీ మోడల్ ప్రస్తుతం పెద్ద ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించిన టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)ని కూడా వెనక్కి నెట్టి, విండ్సర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.


ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ తాజాగా ఈ కారు కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. మార్కెట్‌లోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చారు. దీనికి ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్‌స్పైర్ ఎడిషన్ అని పేరు పెట్టారు.

నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన నివాసంలో ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఆవిష్కరించారు. విండ్సర్ ఈవీ 38 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ ఆధారంగా ఈ ఇన్‌స్పైర్ ఎడిషన్‎ను రూపొందించారు. రెగ్యులర్ మోడల్‌ను ఆధారంగా చేసుకున్నందున, ఇన్‌స్పైర్ ఎడిషన్‌కు కేవలం చిన్నపాటి రూపంలో మార్పులు మాత్రమే చేశారు.

స్పెషల్ లుక్, డిజైన్

ఈ ప్రత్యేక ఎడిషన్‌కు చేసిన చిన్నపాటి మార్పులు కూడా కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తాయి. డిజైన్ పరంగా సాధారణ మోడల్‌లా ఉన్నప్పటికీ, కొత్తదనం కోసం పెర్ల్ వైట్, స్టార్రీ బ్లాక్ అనే డ్యూయల్-టోన్ ఎక్సటర్నల్ కలర్ ఆప్షన్ అందించారు.

ఇన్‌స్పైర్ ఎడిషన్ కారు పై భాగం (బానెట్‌తో సహా) మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. మిగిలిన బాడీ అంతా తెలుపు రంగులో ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కారు పక్క భాగంలో ఉన్న డోర్ క్లాడింగ్‌లపై రోజ్ గోల్డ్ కలర్ ట్రిమ్‌ను ఉపయోగించారు, ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ డిజైన్ ఒకేలా ఉన్నా, వాటిని గ్లాస్ బ్లాక్ కలర్లో తయారు చేయడంతో స్పెషల్ లుక్ వచ్చింది.

లోపల కూడా లగ్జరీ

కారు లోపలికి వెళ్తే, క్యాబిన్ థీమ్ మారినట్లు చూడవచ్చు. ఇన్‌స్పైర్ ఎడిషన్‌కు ఎంజీ మోటార్ సంగ్రియా రెడ్ మరియు బ్లాక్ లెదర్ అప్‌హోల్‌స్టరీని ఇచ్చింది. హెడ్‌రెస్ట్‌లపై ఇన్‌స్పైర్ ఎడిషన్ అని స్పెషల్‎గా ఎంబ్రాయిడరీ చేశారు. మిగతా ఫీచర్లన్నీ టాప్-ఎండ్ స్టాండర్డ్ మోడల్‌లో ఉన్నట్లే ఉంటాయి.

ఎంజీ విండ్సర్ ముఖ్యమైన ప్రత్యేకతలలో ఒకటి 135-డిగ్రీలు వంగే ఎయిర్‌లైన్ లాంజ్ తరహా వెనుక సీట్లు. అంతేకాకుండా, స్కైలైట్ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్, మెరిసే స్కఫ్ ప్లేట్‌లు కారుకు మరింత లగ్జరీ రూపాన్ని ఇస్తాయి.

లిమిటెడ్ ఎడిషన్, రిలీజ్ వివరాలు

విండ్సర్ ఈవీ అమ్మకాలు ప్రారంభమై దాదాపు ఏడాది అవుతోంది. ఈ కాలంలో కంపెనీ సుమారు 40,000 యూనిట్లను విక్రయించింది. ఈ ఇన్‌స్పైర్ ఎడిషన్ మాత్రం కేవలం 300 యూనిట్లను మాత్రమే అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ఆగస్టు 2025 నెలలో మాత్రమే దాదాపు 4,511 యూనిట్లను విక్రయించి, వరుసగా 11 నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీగా నిలిచింది.

ఈ ప్రత్యేక ఎడిషన్‌కు సంబంధించిన బుకింగ్‌లు అప్పుడే ప్రారంభమయ్యాయి. కంపెనీ త్వరలోనే, అక్టోబర్ 15 నుంచే ఈ ఈవీ డెలివరీలను కూడా మొదలుపెట్టనుంది. ఈ మోడల్‌కు 38 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపిక ఉంది. దీని డ్రైవింగ్ రేంజ్ 332 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది.

విండ్సర్ ఈవీ, దాని పోటీదారైన నెక్సాన్ ఈవీ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీని బూట్ స్పేస్ కూడా ఎక్కువ. 15.6-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లలో ఇది మెరుగ్గా ఉంది. అందుకే ఇది భారతీయ మార్కెట్‌లో అత్యధిక ప్రజాదరణ పొందింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.