వంట నూనె ధరలకు చెక్.. కేంద్రం మాస్టర్ ప్లాన్.. ఇకపై వంటింట్లో ఆయిల్ కష్టాలు ఉండవు

ప్రజల నిత్యావసర వస్తువుల్లో వంట నూనె ఒకటి. వంటింట్లో నూనె (Edible Oil) లేనిదే రోజు గడవదు. అలాంటిది ఆ నూనె కోసం మన దేశం వేరే దేశాల మీద భారీగా ఆధారపడాల్సి వస్తోంది.
ఇందుకు ఏటా రూ.లక్షల కోట్లు విదేశాలకు ధారపోస్తున్నాం. ఈ పరిస్థితి మార్చడానికి, మన రైతుల (Farmers) జేబులు నింపడానికి భారత ప్రభుత్వం (Indian government) ఓ భారీ వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. విత్తనం నుంచి బాటిల్ వరకూ మన నూనె మనమే తయారు చేసుకునేలా డిజైన్ చేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.


టార్గెట్ ఏంటి?
ప్రస్తుతం మన దేశ అవసరాలకు సరిపడా వంట నూనె మన దగ్గర లేదు. మనం వాడే నూనెలో ఏకంగా 57 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీని కోసం పోయిన ఏడాది మనం ఖర్చు చేసింది అక్షరాలా రూ.1.61 లక్షల కోట్లు. ఈ నంబర్ తగ్గించడానికే 2025 జనవరిలో ప్రభుత్వం ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్’ను ప్రారంభించింది. దీని బడ్జెట్ రూ.10,103 కోట్లు. ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ప్రకారం, 2032 నాటికి మన దిగుమతులను 57 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలి. అంటే సగానికి సగం అన్నమాట. ఆవాలు, సోయాబీన్, వేరుశనగ, పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) లాంటి పంటల సాగును భారీగా పెంచి ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్లాన్ చేశారు.

రైతులకు ఫుల్ సపోర్ట్
కేవలం ప్లాన్ వేస్తే సరిపోదు, గ్రౌండ్ లెవల్‌లో వర్కవుట్ అయితేనే ఫలితాలు వస్తాయి. అందుకే ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనాలను ప్రోత్సహిస్తూ, 2025-26 సీజన్‌లోనే దాదాపు 11 లక్షల హెక్టార్లలో వీటిని సాగు చేయించింది. అలాగే నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని 29 మిలియన్ల హెక్టార్ల నుంచి 33 మిలియన్ల హెక్టార్లకు పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా నూనె గింజలను వేసవి పంటగానూ పండించేలా ఎంకరేజ్ చేస్తూ, ఎంపిక చేసిన ప్రాంతాల్లోని రైతులకు ఒక హెక్టార్ వరకూ ఉచిత విత్తనాలతో పాటు సాగు మెలకువలపై ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తోంది.

ప్రాసెసింగ్ యూనిట్లకు సబ్సిడీ
పంట పండించడమే కాదు, దాన్ని నూనెగా మార్చే మిల్లులు (ప్రాసెసింగ్ యూనిట్లు) కూడా మన దగ్గరే ఉండాలి. అందుకే స్థానికంగా ఆయిల్ మిల్లులు పెట్టేవారికి ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తోంది. దాదాపు రూ.30 లక్షల విలువైన యూనిట్ పెడితే, అందులో రూ.7 లక్షలు ప్రభుత్వమే ఇస్తుంది. ఇప్పటివరకు రైతు సంఘాలు, సహకార సంఘాలు నడిపే 263 యూనిట్లకు పర్మిషన్లు వచ్చేశాయి. రైతులకు మార్కెట్ భయం లేకుండా, ‘PM-ASHA’ లాంటి పథకాల ద్వారా ప్రభుత్వమే పంటను కొంటోంది. 2024-25లో రైతుల నుంచి 19.9 లక్షల టన్నుల సోయాబీన్, 17.7 లక్షల టన్నుల వేరుశనగను ప్రభుత్వం సేకరించింది.
క్లస్టర్ విధానంలో పక్కా ప్లాన్
దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ‘క్లస్టర్’ విధానాన్ని ఎంచుకుంది. 500 జిల్లాల్లో 1,076 క్లస్టర్లను గుర్తించింది. ఇక్కడ విత్తనం సప్లై దగ్గరి నుంచి పంట కొనుగోలు, ఆయిల్ ప్రాసెసింగ్ వరకూ అన్నీ ఒకే గొడుగు కిందకు తెస్తున్నారు. దీనివల్ల పని సులువుగా జరగడమే కాదు, రైతులకు మంచి ఆదాయం కూడా దక్కుతుంది.

భవిష్యత్తు అంచనాలు
ఈ మిషన్ ద్వారా 2030-31 నాటికి నూనె గింజల ఉత్పత్తిని 39 మిలియన్ టన్నుల నుంచి ఏకంగా 70 మిలియన్ టన్నులకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే 2031-32 కల్లా దేశీయంగా తయారయ్యే వంట నూనెను 2 కోటి టన్నులకు (20 మిలియన్ టన్నులు) పైగా పెంచనున్నారు. ఈ నిర్ణయాన్ని ‘ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ ప్రెసిడెంట్ సుధాకర్ దేశాయ్ స్వాగతించారు. ‘దీనివల్ల మన ఆయిల్ రిఫైనరీలకు స్థానికంగానే ముడిసరుకు దొరుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు అకస్మాత్తుగా పెరిగినా మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు’ అని తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.