యువతపై సోషల్‌ మీడియా ఎఫెక్ట్‌

 ప్రస్తుత సమాజంలో శరీర ఆరోగ్యానికిచ్చినంత ప్రాధాన్యత మానసిక ఆరోగ్యానికి ఇవ్వకపోవడం శోచనీయం..! ఏదైనా సమస్య వచ్చినా ఇతరులతో షేర్‌ చేసుకునే పరిస్థితి కూడా లేదు.


ఒక వేళ షేర్‌ చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్లాలనే సమాచారం కూడా లేదు. దానివల్ల చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ‘మానసిక సమస్యలపై బహిరంగ చర్చలు ‘ జరగాలనే పిలుపునిచ్చింది.

చాలామంది దైనందిన జీవితాల్లో సోషల్‌ మీడియా ఒక భాగమైపోయింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకూ వినియోగిస్తున్నారు. భారతీయులు సోషల్‌ మీడియా మీద సగటున రోజుకు 2 గంటల 40 నిమిషాలు గడుపుతున్నారు. 18-24 ఏండ్ల వయస్సున్న యువతీ యువకులు మరింత ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కేవలం ఈ వయసు వాళ్లలోనే ఫేస్‌బుక్‌కు 9.72 కోట్ల మంది వినియోగదారులు, ఇన్‌స్టాగ్రామ్‌కు 6.9 కోట్ల మంది వినియోగదారులు భారత్‌లో ఉన్నారు.

ముఖ్యంగా 12 ఏళ్ల నుండి …
ముఖ్యంగా 12 నుండి 22 ఏళ్ల మధ్య ఉండే యువత తమ లక్ష్యాలు, గుర్తింపు కోసం పనిచేసే క్రమంలో … వారిపై సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. అయితే ఆ సోషల్‌ మీడియాను ఉపయోగకరంగా వాడుకోగలిగితే ఎక్కువ లాభాలుంటాయి… అదే సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తే పర్యవసానాలు ఊహించడం కష్టం..! సోషల్‌ మీడియాలో సొసైటీని చూస్తుంటారు. ఆకర్షితులవుతుంటారు. సోషల్‌ మీడియాలోకి వెళ్లడానికి ముందుగా చిన్నపిల్లలకు వారి తల్లిదండ్రులు ఆ సోషల్‌ మీడియాను ఎంతవరకు ఎలా వాడుకోవాలనే విషయాలపై అవగాహన ఇవ్వాలి. అప్పటి నుండి వారు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారం నుండి మంచి విషయాలను తీసుకోగలుగుతారు. మంచి స్కిల్స్‌ పాజిటివ్‌ విషయాలు నేర్చుకోగలుగుతారు.

అన్‌లిమిటెడ్‌ ….
సోషల్‌ మీడియా వల్ల ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడి వారితోనైనా మాట్లాడగలం.. దీనివల్ల ప్రపంచంలో పలుచోట్ల విషయాలను తెలుసుకోగలుగుతారు. వారి సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోగలుగుతారు. రకరకాల వంటలు, అభిరుచులు నేర్చుకోగలుగుతారు. ఆయా ప్రాంతాల్లో ఉండేవారి పాజిటివిటీ, యాటిట్యూడ్‌ వంటివి ఇంకా చాలా విషయాలపై అవగాహన కలుగుతుంది. అయితే సోషల్‌ మీడియా అనేది అన్‌లిమిటెడ్‌.. కాబట్టి దాన్ని ఎంతవరకు బ్యాలెన్సింగ్‌గా తీసుకొని వాడగలుగుతున్నామనేదే ముఖ్యం. కాబట్టి ఏ వయస్సులో పిల్లలను సోషల్‌ మీడియా వేదికపై తీసుకురావాలనే విషయంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు సోషల్‌ మీడియా నుండి ఏం నేర్చుకుంటున్నారనే విషయాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి.

చెడు ప్రభావం ఎక్కువ ….
సోషల్‌ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలుంటాయో… అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎక్కువగా నష్టాలుంటాయని చెప్పాలి. ముఖ్యంగా యువత వాటికి ఎక్కువగా ఆకర్షితులవుతారు. దాని ప్రభావం ఎంత తీవ్రంగా వారి జీవితంపై పడుతుందనే అవగాహన కూడా ఉండదు. రోజులో 3 గంటలకంటే ఎక్కువగా సోషల్‌ మీడియాను వాడేవారు ఎక్కువగా ఆందోళనలకు ఒత్తిడి గురవుతున్నట్లు సైకాలజిస్టులు చెబుతున్నారు.

లాభాలు ….
స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా కనెక్ట్‌ అవ్వడానికి సోషల్‌ మీడియా సహాయపడుతుంది.
కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సృజనాత్మకతను పెంచుకోవడానికి విద్యాపరమైన వీడియోలు ఉపయోగపడతాయి.
ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
తమ అభిప్రాయాలను, ప్రతిభను ప్రపంచానికి చాటుకునే వేదికగా స్వీయ అభివృద్దికి పనిచేస్తుంది.

నష్టాలు ….
ఎక్కువ నిద్రలేమి, అలసట కలుగుతాయి. మిగిలినవారితో పోల్చుకోవడం వల్ల వారిపై వారికే అనుమానాలు వస్తాయి. చేయలేను, అవ్వదు.. అనే నిరాశ, ఆత్మనూన్యతాభావం కలుగుతుంది. ఆన్‌లైన్‌ వేధింపులు మానసిక వేదనకు, తీవ్రమైన సందర్భాల్లో ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తాయి. గంటల తరబడి ఫోన్‌లకు అతుక్కుపోవడం వల్ల అది వ్యసనంగా మారి చదువు, శారీరక శ్రమ తగ్గిపోతుంది. తప్పుడు వార్తలు, విషపూరిత కంటెంట్‌కు గురికావడం వల్ల తప్పుడు అభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఇతరులకన్నా తక్కువ అనే భావన పెరుగటంతో ఇతరులను వేధించటం, బెదిరించటం, వంటి దుష్ట లక్షణాలు అలవడుతున్నాయి. దీనివల్ల ఆయావ్యక్తుల ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నది. ఇన్ని నష్టాలుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.

యూనిసెఫ్‌ ప్రకారం …
యూనిసెఫ్‌ ప్రకారం.. 15-24 ఏండ్ల వయసున్న భారతీయుల్లో ప్రతీ ఏడుగురిలో ఒకరు కుంగుబాటు (డిప్రెషన్‌)కు గురవుతున్నారు. డిప్రెషన్‌ వల్ల ఆత్మవిశ్వాసం లోపించటం, ఏకాగ్రత లేకపోవటం, ఇతరులతో వ్యవహరించే పద్ధతిలో, సంభాషించే విషయంలో సమస్యలు ఎదుర్కోవటం వంటివి తలెత్తుతున్నాయి. ఫలితంగా చేస్తున్న పని మీద, చదువుల మీద దృష్టి పెట్టలేకపోవటం, దుందుడుకుతనంతో కొట్లాటలకు దిగటం, ఆత్మహత్య ఆలోచనలకు గురికావటం వంటి మరింత సంక్షోభంలోకి వెళ్తున్నది యువత. టైమ్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం … తాము అందంగా లేమని భావించే టీనేజీ అమ్మాయిల్లో 32 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్‌ కారణంగా మరింత న్యూనతకు గురయ్యామని చెప్పారు.

పరిష్కార మార్గాలేమిటంటే …
సోషల్‌ మీడియా వాడకానికి సమయ పరిమితులను విధించుకోవడం, తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్‌ కార్యకలాపాలను పర్యవేక్షించడం, డిజిటల్‌ డిటాక్స్‌ (కొంతకాలం సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం) పాటించడం, ముఖ్యంగా, సోషల్‌ మీడియా ఒక రెండంచుల కత్తి వంటిది. దీనిని బాధ్యతాయుతంగా ఉపయోగించడం వల్ల యువత ప్రయోజనం పొందవచ్చు.

నియంత్రణ అవసరం ….
సోషల్‌ మీడియా వినియోగంపై ముఖ్యంగా టీనేజీ దశకు కూడా చేరుకోని పిల్లల్లో దాని వినియోగంపై నియంత్రణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సోషల్‌ మీడియా వల్ల తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం జరగాలి. డిప్రెషన్‌, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల కేసులు ఏ స్థాయిలో నమోదవుతున్నాయో రికార్డు చేయాలి. వాటికి కారణాలను గుర్తించాలి. కుల, మత, ప్రాంత, లింగ, వర్గ తదితర సామాజిక అంశాల నేపథ్యాన్ని కూడా తీసుకొని ఈ అధ్యయనం జరపాలి. దేశంలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవటానికి అవసరమైన విధానపరమైన, చికిత్సపరమైన పరిష్కారాలు ఈ విధమైన సమగ్ర పరిశోధన వల్లనే లభిస్తాయి.

అవగాహన పెంచాలి …
సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడటం వల్ల కలిగే సమస్యపై అవగాహనను పెంచటం. ఈ సమస్యను చెప్పుకోవాలంటేనే భయపడే, మొహమాటపడే పరిస్థితి లేకుండా స్వేచ్చాయుత వాతావరణాన్ని కల్పించటం. సమస్య నుంచి బయటపడటానికి బాధితులకు కుటుంబసభ్యులు, స్నేహితులు అండగా నిలబడేలా వారిలో ఆత్మస్థెర్యాన్ని, అవగాహనను పెంపొందించాలి. అంతేగాక, ఇలాంటి వ్యవస్థీకృత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే.. విద్యారంగంలో, పని ప్రదేశాల్లో తీసుకురావాల్సిన మార్పుల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. చర్చలు జరగాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.