వీరు పొరపాటున కూడా మటన్ పాయా సూప్ తాగొద్దు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

మటన్ పాయా సూప్‌లో ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుండె, కీళ్ల వ్యాధులు, గర్భిణీ స్త్రీలు డాక్టర్ల సలహా లేకుండా తాగకూడదు. శుభ్రత తప్పనిసరి.


మటన్ పాయా సూప్‌ అంటే చాలామందికి ఎంతో ఇష్టం. ఈ సూప్‌ రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందిస్తుంది. మేక లేదా గొర్రె కాళ్లతో తయారుచేసే ఈ సూప్‌లో ప్రోటీన్లు, కాల్షియం, జింక్, ఐరన్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ముఖ్యంగా చలికాలంలో మటన్ పాయా సూప్ తాగితే శరీరానికి వేడి కలిగి, జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయని అంటారు. అలాగే దీన్ని తరచూ తాగితే ఎముకలు బలంగా మారుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా నిపుణులు చెబుతుంటారు. అయితే అందరికీ ఈ సూప్‌ తాగడం మంచిదే అనుకోవడం తప్పు

డాక్టర్ల ప్రకారం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ సూప్‌ను పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఇందులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని పెంచి గుండెపై ఒత్తిడిని పెంచుతాయి. అలాగే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ సూప్‌ తాగరాదు.

ఎందుకంటే పాయా సూప్‌లోని కొవ్వు మరియు కొన్ని ప్రోటీన్‌ పదార్థాలు యూరిక్ యాసిడ్‌ను ఇంకా పెంచుతాయి. దీంతో కీళ్ల నొప్పులు, గౌట్‌, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు మరింత తీవ్రం కావచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా మటన్ పాయా సూప్‌ను దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే ఇది చాలా హెవీ ఫుడ్‌ కావడంతో జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.

అలాగే కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. డాక్టర్ల సూచన లేకుండా ఇలాంటి ఆహారాలు తినకపోవడం గర్భిణీ స్త్రీలకు మంచిది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మటన్ పాయా సూప్‌ తయారీలో శుభ్రత చాలా ముఖ్యం. మేక లేదా గొర్రె కాళ్లను బాగా శుభ్రం చేయకపోతే వాటిలో ఉన్న మలినాలు, బ్యాక్టీరియా సూప్‌లోకి చేరే ప్రమాదం ఉంది.

సాల్మనెల్లా, ఈ కొలి వంటి బ్యాక్టీరియా వల్ల ఆహార విషబాధ, జీర్ణ సమస్యలు రావచ్చు. అందుకే పాయాలను బాగా శుభ్రంగా కడిగి, ఎక్కువ సేపు ఉడికించడం తప్పనిసరి. మొత్తం మీద మటన్ పాయా సూప్‌ ఆరోగ్యానికి మంచిదే అయినా, అది ప్రతి ఒక్కరికీ సరిపోదు. ఆరోగ్యంగా ఉన్నవారు పరిమితంగా తాగితే శరీరానికి శక్తి, పోషకాలు అందుతాయి.

కానీ గుండె, కీళ్ల వ్యాధులు, లేదా యూరిక్ యాసిడ్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యుడి సలహా తీసుకొని మాత్రమే తాగడం ఉత్తమం. సరైన రీతిలో తయారు చేసి, శుభ్రత పాటిస్తే మటన్ పాయా సూప్‌ రుచికరమైనదిగా, ఆరోగ్యకరమైనదిగా ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.