ఏపీ ఎన్నికల తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే.. చివరగా ఈ రెండు నియోజకవర్గాల రిజల్ట్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై అందరి కళ్లు ఉన్నాయి. మళ్లీ వైఎస్సార్‌సీపీ గెలుస్తుందా.. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తోందా అనే చర్చ జరుగుతోంది. జూన్ 4 కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. మరో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఓట్ల లెక్కింపునకు సంబంధింంచి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4న కౌంటింగ్‌లో భాగంగా.. ముందుగా సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఈటీబీపీఎస్ (ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్) ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.
కౌంటింగ్ రోజున ఉదయం 11 గంటల కల్లా ఫలితాలపై ట్రెండ్ ఎలా ఉందో ఒక అంచనాకు రావొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. మధ్యాహ్నానికి తుది ఫలితాలపై క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటి పూర్తవుతుందని.. ఫలితాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. మరో 61 నియోజకవర్గాల్లో ఫలితాలు సాయంత్రం 4 గంటలకు పూర్తిగా క్లారిటీ వస్తుందంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకల్లా ఫలితాలు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.
అయితే జూన్ 4న తొలి ఫలితం ఏ నియోజకవర్గం.. చివరిగా ఏ నియోకవర్గాల ఫలితాలు వస్తాయనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలను బట్టి చూస్తే.. తొలిఫలితం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే జిల్లాలోని కొవ్వూరు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది. అలాగే విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం, ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం ఫలితాల కోసం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచొడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (కుప్పం), వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (పులివెందుల), జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ (పిఠాపురం) నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మధ్యాహ్నానికి వెల్లడవుతాయని చెబుతున్నారు.


కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.. అవసరమైన చోట అదనపు బలగాలను కూడా మోహరించారు. అలాగే కౌంటిగ్ కేంద్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని మీనా హెచ్చరించారు. పోలింగ్ కేంద్రం బయట 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటున్నారు. అంతేకాదు ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అంతేకాదు జూన్‌ 4న సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు దాదాపుగా వెల్లడించి.. అనంతరం విజయం సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల జారీ, ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలింపు ఉంటుందన్నారు. మొత్తం ప్రక్రియను రాత్రి 9 గంటల్లోపే పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎవరూ ఊరేగింపులు, ర్యాలీలు చేయడానికి అనుమతి లేదన్నారు.

మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్ 13ఏ పై అధికారి సంతకం మాత్రమే ఉండి.. ఆ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లబాటు అవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అలాంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించకూడదని తెలిపింది. ఈ నెల 25న సీఈవో ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా.. ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.