సౌత్‌ సినిమాలో విరిసిన పద్మాలు… తెలుగు హీరోలు

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards 2026) ప్రకటించింది. ఈ ఏడాది ఐదుగురిని పద్మ విభూషణ్, పదమూడు మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది.

సినిమా విషయానికి వస్తే… దక్షిణాది చిత్రసీమకు పట్టం కట్టిందని చెప్పాలి. తెలుగు హీరోలు ఇద్దరిని పద్మశ్రీ వరించింది.


మురళీమోహన్, రాజేంద్రప్రసాద్…
ఇద్దర్నీ వారించిన పద్మశ్రీ పురస్కారం!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో మాగంటి మురళీ మోహన్ (Murali Mohan)ని ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. చిత్రసీమలో ఆయనది ఐదు దశాబ్దాల ప్రయాణం. ఆయన కేవలం కథానాయకుడు – నటుడు మాత్రమే కాదు… రాజకీయ నాయకుడు కూడా! తెలుగు దేశం పార్టీ నుంచి ఓసారి లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. చిత్రసీమకు ఆయన చేసిన సేవకు గాను ఈ పురస్కారం దక్కింది.

పద్మశ్రీ అందుకున్న మరొక తెలుగు హీరో రాజేంద్ర ప్రసాద్. పద్మ అవార్డుల జాబితాలో గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ అని పేరు ఉంది. అది నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ పేరు. ఆయనతో పాటు మురళీమోహన్ సైతం ఏపీ నుంచి పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు.

తమిళం, తెలుగు, హిందీ అంటూ తనకు తాను పరిమితులు విధించుకోకుండా అన్ని సినిమాల్లో నటిస్తూ భారతీయ ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ఆర్ మాధవన్. ఆయనకు మహారాష్ట్ర నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది.

మరణానంతరం బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్రకు…
దివంగత కథానాయకుడు, బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర (Dharmendra)ను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. మరణానంతరం ఆయనకు అవార్డు దక్కింది. భారతీయ చిత్రసీమకు ఆయన చేసిన కృషి, సేవలకు గాను ఈ పురస్కారం ఇవ్వడం సముచితం అని పలువురు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హేమా మాలినిది మద్రాస్. ఆ లెక్కన ధర్మేంద్ర దక్షిణాది అల్లుడు. ఆయనకు పురస్కారం వరించడంతో సౌత్ సినిమా ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పద్మభూషణ్ మమ్ముట్టి… మలయాళంలో
మలయాళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు, భారతీయ ప్రేక్షకులు అందరికీ తెలిసిన నటుడు మమ్ముట్టి (Mammootty)ని సైతం పద్మ పురస్కారం వరించింది. ఆయనకు పద్మ భూషణ్ ఇచ్చారు. హిందీతో కంపేర్ చేస్తే… ఈ ఏడాది సౌత్ సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ పద్మ పురస్కారాలు వచ్చాయని చెప్పవచ్చు.

తెలంగాణకు చెందిన కూచిపూడి నర్తకి దీపికా రెడ్డి, ఏపీకి చెందిన సంగీత విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, తమిళనాడుకు చెందిన బాలసుబ్రమణియన్ సిస్టర్స్ – కర్నాటిక్ సంగీత కళాకారిణులు రజనీ – గాయత్రి, బాలీవుడ్ గాయని అల్కా యాజ్ఞిక్, కేరళకు చెందిన నృత్యకారిణి కలమండలం విమలా మేనన్ సహా మరికొందరికి కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారం వరించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.