కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చేసిన కృషితో వరంగల్ జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) ఆధ్వర్యంలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతులిచ్చింది. .
వారికి వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వరంగల్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాల కోసం ఎంపీ డా. కడియం కావ్య అధికారులతో కలిసి నాలుగు ప్రభుత్వ భవనాలను స్వయంగా పరిశీలించారు. చివరికి వరంగల్ ఆకాశవాణి పరిధిలోని సిబ్బంది క్వార్టర్స్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించగా, కేంద్రం పూర్తి అనుమతులు మంజూరు చేసింది.
వరంగల్ జిల్లాకు అన్ని విధాల పూర్తి అనుమతులు
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో, అలాగే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులతో పలుమార్లు చర్చించి, నిరంతర సంప్రదింపులు జరిపిన ఫలితంగానే వరంగల్‌కు వెల్‌నెస్ సెంటర్ మంజూరైందని ఎంపీ కావ్య తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 22 కేంద్రాలకు వెల్‌నెస్ సెంటర్లకు అనుమతులు లభించగా, వరంగల్ జిల్లాకు మాత్రం అన్ని విధాల పూర్తి అనుమతులు రావడం ప్రత్యేక విషయమన్నారు.
కార్పోరేట్ స్థాయిలో వెల్ నెస్ సెంటర్ అభివృద్ధి చేస్తానన్న ఎంపీ కావ్య
వెల్‌నెస్ సెంటర్‌ను తన ఎంపీ నిధుల ద్వారా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని కావ్య స్పష్టం చేశారు. వరంగల్ పరిధిలోని 54 ప్రధాన పట్టణాల్లో నివసిస్తున్న 15 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈ వెల్‌నెస్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ సేవలు, ఇతర ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయన్నారు.
ఇకపై వరంగల్ లోనే అన్ని వైద్య సేవలు
ఇప్పటివరకు వైద్య సేవల కోసం హైదరాబాద్ లేదా ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై వరంగల్‌లోనే అన్ని ఆరోగ్య సేవలు లభిస్తాయని పేర్కొన్నారు. వెల్‌నెస్ సెంటర్ పనులను వేగవంతంగా ప్రారంభించాలని CGHS డైరెక్టర్ రోహిణిని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. అలాగే వరంగల్‌కు వెల్‌నెస్ సెంటర్ మంజూరు చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి మరియు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సంతోషంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య ఎంపీ డా. కడియం కావ్య చొరవతో పరిష్కారమవ్వడంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్‌లోనే వైద్య సేవలు అందుబాటులోకి రావడం వారికి ఎంతో ఊరట కలిగిందని వారు చెప్తున్నారు.

































