ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి.. మీరు గూగుల్‌లో దాచుకున్న ఫోటోలు, ఫేస్‌బుక్ ముచ్చట్లు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు.. ఇవన్నీ ఇప్పుడు ఎవరో తెలియని హ్యాకర్ చేతిలో ఉంటే?
వినడానికే వణుకు పుడుతోంది కదా! కానీ ఇది అక్షరాలా నిజం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14.9 కోట్ల మంది యూజర్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ (Password Leak) అయ్యాయి. ఇది ఏదో చిన్న పొరపాటు కాదు, మన డిజిటల్ జీవితంపై జరిగిన ఒక పెద్ద దెబ్బ!
Password లీక్ వెనక మాయదారి మాల్వేర్..
మనం ఏదో కావాలని ఒక ఫ్రీ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేస్తాం, లేదా ఏదో తెలియని లింక్‌ని క్లిక్ చేస్తాం. సరిగ్గా అక్కడే అసలు కథ మొదలవుతుంది. మన ఫోన్‌లోకి లేదా కంప్యూటర్‌లోకి ‘ఇన్ఫోస్టీలర్ మాల్ వేర్ (Infostealer Malware)’ అనే ఒక దొంగ వైరస్ దూరిపోతుంది. అది సైలెంట్‌గా మీరు టైప్ చేసే ప్రతి అక్షరాన్ని, మీరు కాపీ చేసే సమాచారాన్ని దొంగిలించి హ్యాకర్లకు పంపేస్తుంది. అలా పోగుచేసిన 96 GB డేటా ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎవరికైనా దొరికేలా బహిర్గతమైంది.
లీకైన డేటా వివరాలు
- ఈమెయిల్స్: 4.8 కోట్ల Gmail ఖాతాలు, 40 లక్షల Yahoo వివరాలు.
- సోషల్ మీడియా: ఫేస్‌బుక్ (1.7 కోట్లు), ఇన్‌స్టాగ్రామ్ (65 లక్షలు), టిక్‌టాక్ వివరాలు
- సినిమాలు & మనీ: నెట్‌ఫ్లిక్స్ (34 లక్షలు) నుండి బైనాన్స్ (క్రిప్టో) వరకు ఏదీ సేఫ్ కాదు.
- స్కూల్స్ & కాలేజీలు: స్టూడెంట్స్ వాడే 14 లక్షల .edu అకౌంట్లు కూడా లీక్ అయ్యాయి.
‘క్రెడెన్షియల్ స్టఫింగ్’.. అంటే తెలుసా?
మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. Gmailకి ఏ పాస్‌వర్డ్ పెడతామో, బ్యాంక్ అకౌంట్‌కి కూడా అదే పెడతాం. హ్యాకర్లకు ఇది పెద్ద ప్లస్ పాయింట్. మీ ఒక అకౌంట్ లాగిన్ వివరాలు దొరికితే, వాటితోనే మీ మిగిలిన అకౌంట్ల తాళాలు తీయడానికి ట్రై చేస్తారు. దీన్నే ‘క్రెడెన్షియల్ స్టఫింగ్’ అంటారు. అంటే, మీ ఇంటి తాళం దొరికితే బీరువా తాళం కూడా దొరికినట్టే!
వెంటనే చేయాల్సిన పని
ముందు పాస్‌వర్డ్ మార్చండి: మీకు అనుమానం ఉన్నా లేకపోయినా.. మెయిల్, బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చేయండి. అది కూడా కొంచెం కష్టమైన పాస్‌వర్డ్‌ని (ఉదాహరణకు అక్షరాలు, అంకెలు, సింబల్స్‌తో) పెట్టుకోండి.
- టూ-స్టెప్ వెరిఫికేషన్ (2FA) ఆన్ చేయండి: ఇది చాలా ముఖ్యం! మీ పాస్‌వర్డ్ ఎవరికైనా తెలిసినా, మీ ఫోన్‌కు వచ్చే ఓటిపి (OTP) లేకుండా వారు లాగిన్ అవ్వలేరు. ఇది మీ అకౌంట్‌కి ఒక ఎక్స్‌ట్రా సెక్యూరిటీ గార్డు లాంటిది.
- ఫ్రీ యాప్స్ విషయంలో జాగ్రత్త: ఎక్కడ పడితే అక్కడ యాప్స్ డౌన్‌లోడ్ చేయకండి. ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి.
- లింకులు క్లిక్ చేయొద్దు: “మీకు లాటరీ తగిలింది”, “మీ అకౌంట్ బ్లాక్ అయ్యింది” అంటూ వచ్చే మెసేజ్‌లలోని లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయకండి.
ఫోన్ మన అరచేతిలో ఉంది కదా అని మనం చాలా ధైర్యంగా ఉంటున్నాం. కానీ, హ్యాకర్లు మన కంటికి కనిపించకుండా మన జేబులు కొట్టేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొందాం.. మన డిజిటల్ తాళాలను గట్టిగా వేసుకుందాం!

































