బంగారం ధరలు బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తోంది. ఉదయం ఒక రేటు కనిపిస్తే.. సాయంత్రానికే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మొత్తానికి గోల్డ్ రేటు భారీగా పెరిగిపోయింది.
ఈ కథనంలో వారం రోజుల్లో (జనవరి 18 నుంచి 24 వరకు) పసిడి ధరలు ఎంత పెరిగాయో వివరంగా తెలుసుకుందాం.
జనవరి 18న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,43,780 వద్ద ఉండేది. ప్రస్తుతం ఈ రేటు రూ. 160260 వద్దకు చేరింది. అంటే 7 రోజుల్లో (168 గంటల్లో) బంగారం ధర రూ. 16వేలు కంటే ఎక్కువ పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,800 వద్ద నుంచి 1,46,900 రూపాయల వద్దకు (రూ. 15వేలు కంటే ఎక్కువ) చేరింది.
చెన్నైలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,44,870 వద్ద నుంచి 1,59,490 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వారం రోజులో 14620 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఇది 1,32,800 రూపాయల నుంచి రూ. 1,47,500 వద్దకు చేరింది.
ఢిల్లీలో జనవరి 18న రూ. 1,43,930 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు ఈ రోజుకు (శనివారం) రూ. 1,60,410 వద్దకు (రూ. 16480 తేడా) చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 131950 రూపాయల నుంచి 147050 రూపాయల వద్దకు చేరింది.
వెండి ధరలు
భారతదేశంలో వెండి ధరలు చాలా వేగంగా ఎగబాకాయి. గత ఆదివారం (జనవరి 18) రూ. 3.10 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. శనివారం నాటికి రూ. 3.65 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో వెండి రేటు రూ. 55వేలు పెరిగిందన్న మాట.

































