అమెరికా, ఆస్ట్రేలియాలో ‘ఇండియన్ గో బ్యాక్’ నినాదం వెనుక అసలు కారణాలివే

మెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటివి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలుగా ముందు వరుసలో ఉంటాయి. అక్కడ ఉద్యోగం దొరికితే జీవితం ‘సెటిల్’ అయినట్టేనన్న భావన భారతీయుల్లో ఉంటుంది.


ఇక, అమెరికాలో ఉద్యోగం దొరకడం లేదా అమెరికా సంబంధం లభించడం ఒక ‘స్టేటస్ సింబల్’గా మారింది. చదువుకున్న విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది అమెరికా, యూకే వంటి దేశాల్లో ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడాలన్న లక్ష్యంతో ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడి అవకాశాలు, ఆ దేశాల్లోని జీవన ప్రమాణాలేనని చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు ఆ దేశాల్లో భారతీయులంటే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ‘గో బ్యాక్ ఇండియన్స్’ అంటూ ర్యాలీలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యతిరేకతకు ఉన్న ఐదు ప్రధాన కారణాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

1. స్థానికులకు ఉద్యోగాలు కోల్పోతున్నామన్న అభద్రతా భావం

అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోకి వలస ఉద్యోగుల రాక స్థానికులకు ఇబ్బందులను కలిగిస్తోంది. తమకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలను భారతీయులు లాక్కుపోతున్నారని అక్కడి యువత ఆవేదన, ఆందోళనలను వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక, నిర్మాణ, ఆతిథ్య రంగాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. తక్కువ వేతనాలకే భారతీయులు తమకు దక్కాల్సిన ఉద్యోగాల్లో చేరుతున్నారన్న ఆరోపణ వీరి నుంచి వినిపిస్తుంది. ఈ వలస విధానాల వల్ల స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్నది వారి వాదన. ఇది మొదటి కారణంగా చెప్పవచ్చు.

2. వలస ఉద్యోగులతో పెరిగిన జీవన వ్యయం, వనరులపై ఒత్తిడి

కొత్త ఉద్యోగ అవకాశాల కోసం తమ దేశానికి వస్తున్న భారతీయ వలస ఉద్యోగులు ఆ దేశ మౌలిక వసతులు, సదుపాయాలపై ప్రభావం చూపుతున్నారని అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు, యూరోపియన్లలో కొందరి వాదన. ముఖ్యంగా నగరాల్లో ఇళ్ల ధరలు పెరగడానికి వలసదారులే కారణమని వారు విమర్శిస్తున్నారు. ఇక, వైద్యం, గృహ నిర్మాణం వంటి వాటి ధరలు పెరగడానికి ప్రధాన కారణం వలసదారులేనని ఆరోపణలు తలెత్తుతున్నాయి. పరిమిత వనరులు ఉండగా అధిక సంఖ్యలో వలస రావడం వల్ల స్థానికులు అధిక ఖర్చుతో జీవనం సాగించాల్సి వస్తుందని వారు భావిస్తున్నారు. ఈ భారం ప్రభుత్వ కార్యక్రమాలపైన కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

3. వలసదారులతో సామాజిక, సాంస్కృతిక సమస్యలు

స్థానిక సంప్రదాయాలు, ఆ దేశ విలువలు, జీవన శైలికి భిన్నంగా వలస వచ్చిన వారు ప్రవర్తిస్తున్నారన్న వాదన ఈ దేశాల్లోని స్థానికుల నుంచి వినిపిస్తుంది. మన దేశం నుంచి వచ్చే వారి ఆచార సంప్రదాయాలను కొద్దిమంది పాశ్చాత్య దేశాల వారు తప్పుపడుతున్నారు. కొందరు భారతీయులు ఎవరితో కలవకుండా తమవారితోనే సంబంధాలు కలిగి ఉండటం, స్థానిక సమాజంతో కలవకుండా దూరంగా ఉండటం వంటివి కూడా అక్కడి వారికి నచ్చడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు తమ సంప్రదాయాలను బహిరంగంగా పాటించడాన్ని కూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో కొందరు తప్పుపడుతున్నారు. ఇలా సాంస్కృతిక వైవిధ్యం కూడా అక్కడి స్థానికుల్లో సంఘర్షణగా మారిందని చెబుతున్నారు. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతి దెబ్బతినేలా వ్యవహారం ముందుకు వెళ్లవచ్చన్న అభద్రతా భావంలో స్థానికులు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణంతో కూడా ‘ఇండియన్ గో బ్యాక్’ అన్న నినాదం పుట్టుకువచ్చినట్లు వారు అభిప్రాయపడుతున్నారు.

4. అక్రమ వలసదారులతో దేశ భద్రతకు ముప్పు అన్న ఆందోళన

సాంస్కృతిక, సంప్రదాయ, జీవన శైలిలో ఉన్న వైరుధ్యాల వల్ల, అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వలసదారుల వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న అనుమానం పాశ్చాత్య దేశాల్లోని ఒక వర్గం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ కారణంగా దేశంలో నేరాల రేటు పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని నివేదికలు వలసదారుల వల్ల నేరాల రేటు పెరిగిందని చెబుతున్నాయి. అయితే, ఇది పక్షపాతంతో కూడిన నివేదికలని నిపుణులు కొట్టిపారేస్తున్నా, స్థానికుల్లో ఇలాంటి సర్వేలు కూడా భయాందోళనలు రేపుతున్నాయి. ఇలాంటి కారణాలతో కూడా ఇటీవల ఎక్కువ మంది భారతీయులు ఆ దేశాల్లో కనిపించడం వల్ల ‘ఇండియన్ గో బ్యాక్’ అనే నినాదం చేస్తున్నారు.

5. రాజకీయ పార్టీల వలస వ్యతిరేక భావాలు

ఈ దేశాల్లోని రాజకీయ పార్టీలు వలస విధానాలపై పరస్పరం రాజకీయంగా రెచ్చగొట్టుకుంటున్నాయి. వలసవాదులను ఒక ‘బూచి’గా చూపి కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను రెచ్చగొడుతున్నాయి. వలస వస్తున్న వారి వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతాయని, వారిపై పెట్టే ఖర్చు దేశంపై భారం పడుతుందని కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ భావాలను రెచ్చగొడుతున్నారు. దీని కారణంగా ఒక వర్గం ప్రజలు ఈ అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి వారికి నాయకత్వం వహించే సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఇక, ఆ దేశంలో వలస విధానంపై విమర్శలు ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఓట్లు కురిపించే ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’గా మారిందనడంలో సందేహం లేదు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.