వాట్సాప్‌లో ఒక ముఖ్యమైన మెసేజ్ వస్తుంది. తర్వాత రిప్లై ఇద్దాంలే అనుకుంటాం. కానీ వేరే పనుల్లో పడి పూర్తిగా మర్చిపోతాం.
మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు వాట్సాప్ ఒక ఫీచర్‌ను తీసుకురాబోతోంది. అదే ఇన్ యాప్ రిమైండర్ ఫీచర్.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. కొంతమంది ఆండ్రాయిడ్, ఐఫోన్ బీటా టెస్టర్లకు మాత్రమే కనిపిస్తోంది. రాబోయే కొన్ని రోజుల్లో లేదా వారాల్లో అందరికీ ఈ అప్‌డేట్ వస్తుంది. ఈ ఫీచర్ రాగానే వాడుకోవాలంటే, వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోండి.
రిమైండర్ సెట్ చేయడం ఎలా?
ఈ ఫీచర్ మీ ఫోన్‌లోకి వచ్చాక, రిమైండర్ సెట్ చేయడానికి రెండు సులువైన మార్గాలు ఉన్నాయి. మొదటి ఆప్షన్‌లో సెండ్ బటన్ వాడాలి. అందుకు ముందుగా మీరు ఎవరికైతే రిమైండర్ పెట్టాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయండి. మెసేజ్ టైప్ చేసే బాక్సు పక్కన ఉండే గ్రీన్ సెండ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి.
అనంతరం వచ్చిన మెనూలో, పైన కుడివైపు ఉన్న మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేయండి. రిమైండ్ మీ (Remind Me) ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు 2 గంటల్లో, 8 గంటల్లో, లేదా 24 గంటల్లో వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. లేదా కస్టమ్ ఆప్షన్ ఎంచుకుని మీకు నచ్చిన టైమ్ సెట్ చేసుకోవచ్చు.
రెండో ఆప్షన్‌లో.. మీరు ఏ మెసేజ్ అయితే గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో, ఆ మెసేజ్ మీదనే లాంగ్ ప్రెస్ చేయండి. వచ్చిన మెనూలో More ఆప్షన్ పైన క్లిక్ చేసి, ఆ తర్వాత Remind Me సెలెక్ట్ చేసుకోండి. పైన చెప్పిన విధంగానే టైమ్ సెట్ చేసుకోండి. రిమైండర్ సెట్ అవ్వగానే, ఆ మెసేజ్ పక్కన ఒక చిన్న గంట సింబల్ (Bell icon) కనిపిస్తుంది.
రిమైండర్‌ను క్యాన్సిల్ చేయడం ఎలా?
మీరు సెట్ చేసుకున్న రిమైండర్ అవసరం లేదనుకుంటే, దాన్ని సులభంగా తీసేయొచ్చు. గంట సింబల్ ఉన్న మెసేజ్‌ను వెతకండి. ఆ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి, Mor ఆప్షన్‌లోకి వెళ్లండి. అక్కడ క్యాన్సిల్ రిమైండర్ ఆప్షన్‌ను ఎంచుకోండి. వెంటనే ఆ రిమైండర్ డిలీట్ అవుతుంది, బెల్ ఐకాన్ కూడా మాయమవుతుంది.
ఇకపై ముఖ్యమైన మెసేజ్‌లను గుర్తుపెట్టుకోవడానికి స్క్రీన్‌షాట్లు తీసుకోవడం, మెసేజ్‌ను అన్ రీడ్ (unread) గా మార్చుకోవడం వంటి పనులు చేయక్కర్లేదు. ఈ ఫీచర్ నేరుగా యాప్‌లోనే ఉండటం వల్ల చాలా సౌకర్యంగా ఉంటుంది. మీరు సెట్ చేసిన టైమ్‌కి వాట్సాప్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది.

































