డిజిటల్ యుగంలో స్కామ్, ఆన్ లైన్ ఫ్రాడ్, డిజిటల్, వర్ట్చువల్ అరెస్టులు మన జీవితంలో భాగంగా మారాయి. ‘క్లిక్ చేస్తే క్లీన్, రిప్లై ఇస్తే రీప్’ అనే తరహాలో అనేక మంది మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు.
అయితే ఈ వ్యవస్థీకృత స్కామ్ ప్రపంచంలో ఒక యువకుడు స్కామర్‌నే బోల్తా కొట్టించి, ‘మోసం చేయడానికి వచ్చినవాడే ఏడుస్తూ క్షమాపణలు కోరే’లా చేసిన ఘటన ఇప్పుడు దేశం నలుమూలలా చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక మోసగాడిని కట్టిపడేసిన కథ మాత్రమే కాదు.. ఆధునిక టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే ఎంత అద్భుతాలు సాధ్యమవుతాయో నిరూపించిన ఉదాహరణ కూడా.
స్కామర్ మెసేజ్..
ఢిల్లీకి చెందిన ఒక యువకుడికి ఫోన్‌లో ఒక సాధారణ మెసేజ్ వచ్చింది. కాలేజీలో నీకు నేను సీనియర్ అని, ప్రస్తుతం ఐఏఎస్ అధికారిగా ఉన్నానని స్కామర్ నమ్మించాడు. నాకు ట్రాన్స్ ఫర్ అయ్యింది. తక్కువ ధరకు ఫర్నీచర్ అమ్ముతున్నానంటూ వల వేశాడు. చాలా మంది స్కామర్ వలలో పడొచ్చు.. తక్కువ ధరకు ఫర్నీచర్ వస్తుందని డబ్బు పంపించవచ్చు, లేక మెసేజ్ బ్లాక్ చేయవచ్చు. కానీ ఆ యువకుడు మాత్రం ఆ మెసేజ్‌లో ఉన్న మతలబును పసిగట్టాడు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈసారి స్కామర్‌కే డిజిటల్ పాఠం చెప్పాలి అనుకున్నారు.
చాట్ జీపీటీ కోడ్..
అక్కడే ప్రారంభమైంది అతని ఆపరేషన్ ఒక AI ఆధారిత ప్రతిఘటన. చాట్‌జీపీటీని ఒక పరికరంలా కాకుండా, ఒక సాధనంలా వాడాలని నిర్ణయించుకున్నాడు. స్కామర్‌ను పట్టుకునేలా, అతని వివరాలు బయటపడేలా ఒక నకిలీ ‘పేమెంట్ పోర్టల్’ రూపొందించమని AIకి ఆదేశించాడు. అయితే ఇది డబ్బు పంపే వేదిక కాదు స్కామర్ క్లిక్ చేస్తే అతని జియో లొకేషన్, IP అడ్రస్, ఇంకా ముఖ్యంగా అతని సెల్ఫీ క్యాప్చర్ అయ్యేలా డిజైన్ చేసిన స్మార్ట్ ట్రాప్. ‘AIతో చేసే సైబర్ ట్రిక్స్ ఇంత సులభమా?’ అని అనిపించేలా ChatGPT కొద్ది నిమిషాల్లోనే అతను కోరిన మోడల్‌కు కోడ్‌ను సిద్ధం చేసింది.
ట్రాకర్ పేజీతో స్కామర్ వివరాలు..
ట్రాకర్ పేజీ రెడీ. ఇప్పుడు స్కామర్ వలలో పడడమే మిగిలింది. ఆ యువకుడు మీ క్యూఆర్ QR అప్‌లోడ్ చేస్తే చెల్లింపు వెంటనే వస్తుందని చెప్పి లింక్ పంపాడు. డబ్బు కోసం అత్యవసరంగా ఎదురు చూస్తున్న స్కామర్, ఏమాత్రం అనుమానం లేకుండా లింక్‌ను ఓపెన్ చేశాడు. ఒక క్లిక్‌తో, అతని సమస్త గుప్తరహస్యాలు ఆ నకిలీ పోర్టల్‌కు చేరిపోయాయి ఉంటున్న స్థలం, IP, ఇంకా కెమెరా తెరచి తీసిన అతని స్పష్టమైన ఫొటో కూడా.
అదే సమాచారాన్ని వెంటనే యువకుడు స్కామర్‌కే పంపాడు. తమకే తెలిసిన డేటాను ఎదుటివాడు చూపించడం.. అది మోసగాళ్లకు అతి పెద్ద కౌంటర్ ఎటాక్. ఒక్కసారిగా స్కామర్‌కి భయం పట్టుకుంది. వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ, ‘దయచేసి ఇవన్నీ డిలీట్ చేయండి, ఇకపై ఇలాంటి పని చేయను’ అంటూ ఏడుస్తూ వేడుకోవడం ప్రారంభించాడు.
టెక్నాలజీని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు..
ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు. టెక్నాలజీని చెడుకు వాడితే ఎలా మోసాలు జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం. కానీ మంచికి, రక్షణకు కూడా ఇది సమానంగా శక్తివంతమని ఈ ఘటన నిరూపించింది. స్కామ్‌లు చేసే వారు ఎంత తెలివిగా ప్లాన్ చేస్తారో, బాధితులు కూడా అంతే తెలివిగా ప్రతిఘటించగలరని ఇది స్పష్టం చేసింది.
ఈ ఘటన తర్వాత అనేక మంది యువకులు, నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు… “చాట్‌జీపీటీ వాడితే స్కాం కాకుండా స్కామర్‌నే పట్టుకోవచ్చు.’ ఇది సరదాకు చెప్పడం లేదు.. ఇది డిజిటల్ లిటరసీ, సైబర్ అవగాహన అవసరాన్ని గుర్తు చేసే కఠోర నిజం. మోసాలు మారుతున్నాయి, పద్ధతులు అప్‌డేట్ అవుతున్నాయి.. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా, అప్డేట్‌గా ఉండాలి.
ఈ యువకుడు చివరలో రెడిట్‌లో ఒక మాట రాశాడు.. ‘దొంగను బోల్తా కొట్టించడంలో వచ్చే తృప్తి.. ఏ విజయంతోనూ పోల్చలేం.’ అని.. టెక్నాలజీ ఒక ఆయుధం. దానిని ఎలా వాడుతామన్నదే మన భద్రతను నిర్ణయిస్తుంది. ఇలాంటి ఘటనలు మనకు ఒక పాఠం చెబుతున్నాయి. మోసగాళ్లు ఉన్నంత వరకూ, వారిని ఎదుర్కొనేందుకు తెలివైన వారు కూడా ఉంటూనే ఉంటారు.

































