వృద్ధురాలి ప్రాణం కాపాడిన స్మార్ట్ వాచ్.. సోషల్ మీడియాలో వైరల్.. అసలేం జరిగిందంటే..

www.mannamweb.com


ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ వాచ్ లు నేడు ప్రతి ఒక్కరి చేతి మణికట్టుపై కనిపిస్తున్నాయి. ఇవి పేరుకు వాచ్ లే అయినప్పటికీ అనేక ఉపయోగాలు ఉన్నాయి.

ఒక రకంగా మినీ స్టార్ట్ ఫోన్లు గా పనిచేస్తున్నాయి. సమయంతో పాటు మన స్మార్ట్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ లు చూసుకోవడానికి, మాట్లాడటానికి ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణ సమయంలో జేబులోని ఫోన్ తీసే అవసరం లేకుండా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్యం, వ్యాయామం, హార్ట్ బీట్, రక్తపోటు తెలుసుకునే అవకాశం కూడా ఉంది. చిన్న స్మార్ట్ వాచ్ తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అనే ప్రశ్నచాలా మందిలో తలెత్తుతుంది. కానీ ఇది వందశాతం నిజం. పిట్ట కొంచెం కూత ఘనం అనేది సామెత చందాన చిన్న స్మార్ట్ వాచ్ తో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇటీవల ఓ వద్ధ మహిళ ప్రాణాలను స్మార్ట్ వాచ్ కాపాడింది. ఆమెకు సకాలంలో వైద్యం అందేలా సాయ పడింది.

వైరల్‌గా మారిన పోస్టు..

నికియాస్ మోలినా అనే విదేశీయుడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో ఇటీవల ఓ పోస్టును అప్ లోడ్ చేశాడు. తన అమ్మమ్మ కు ఏర్పడిన తీవ్ర మైన గుండె సమస్యను తన ఆపిల్ వాచ్ గుర్తించిందని, దీంతో సకాలంలో ఆస్పత్రికీ తీసుకువెళ్లే వీలు కలిగిందని వివరించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, పరిస్థితి బాగానే ఉందని తెలిపాడు.

ఈసీటీ ఫీచర్..

నికియాస్ మోలినా ఆపిల్ వాచ్ 10 సిరీస్ ను ఉపయోగిస్తున్నాడు. దానిలో ఎలక్ట్రో కార్డియో గ్రామ్ (ఈసీటీ) అనే ఫీచర్ ఉంది. గుండెకు సంబంధించిన సమస్యలను గుర్తించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ వాచ్ ను అతడి అమ్మమ్మ చేతికి పెట్టగా, ఆమె గుండె స్పందన సక్రమంగా లేదని గుర్తించింది. వెంటనే అప్రమత్తమై ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వివిధ రకాల పరీక్షలు జరిపి ఆమెకు ఏట్రియాల్ ఫిబ్రిలేషన్ (ఏఎఫ్ ఐబీ) ఉన్నట్టు నిర్ధారణ చేశారు. దానికి చికిత్స అందించకుంటే తీవ్ర మైన సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.

నెటిజన్ల స్పందన..

స్మార్ట్ వాచ్ పనితీరుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. నికియాస్ మోలినా పోస్టు వైరల్ గా మారింది అనేక మందిని అది ఆకర్షించింది. దాదాపు 2.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆపిల్ వాచ్ లోని ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లు సమర్థంగా పనిచేస్తున్నాయని చాలామంది కితాబు ఇచ్చారు. అలాగే కొందరు తమకు జరిగిన అనుభవాలను కూడా వివరించారు. ఒక వ్యక్తి తన అమ్మ ప్రాణాలను కాపాడటానికి స్టార్ట్ వాచ్ ఉపయోగపడిందన్నారు. ఆమె గుండె స్పందన సరిగ్గా లేదని స్మార్ట్ వాచ్ చూపడంతో ఆస్పత్రికి తీసుకు వెళ్లగా మొదటిసారి చేసిన పరీక్షలో ఏమీ తెలియలేదన్నాడు. మళ్లీ రెండోసారి చేయగా ఏఎఫ్ఐ బీ బయటపడిందని, దీంతో సకాలంలో చికిత్స అందించినట్టు తెలిపాడు.

ఆరోగ్య ఫీచర్లు..

ఆపిల్ వాచ్ లో అధునాతన ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లు ఉన్నాయి. ట్రాకింగ్ దశలు చాలా సమర్థంగా పనిచేస్తాయి. ఈసీజీ యాప్ ద్వారా మణికట్టు నుంచే గుండె స్పందన తీరును పసిగడుతుంది. ఏఎఫ్ఐబీ తదితర తీవ్రమైన గుండె సమస్యను గుర్తిస్తుంది.