చాలా మంది తమ ఫోన్‌లోని టైప్-సి పోర్ట్‌ను కేవలం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మాత్రమే వాడుతుంటారు. నిజానికి, ఈ ఒక్క పోర్ట్ మీ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌గా లేదా ల్యాప్‌టాప్‌గా మార్చగలదు.
ఆశ్చర్యపరిచే ఆ ఇతర ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మీ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌గా మార్చుకోండి: మీ ఫోన్ ఛార్జింగ్ కోసం మీరు పవర్ బ్యాంక్ వాడుతుండవచ్చు. కానీ మీ ఫోన్ ద్వారానే ఇతర పరికరాలను ఛార్జ్ చేయవచ్చని మీకు తెలుసా? టైప్-సి టు టైప్-సి కేబుల్ ఉపయోగించి మీ ఫోన్ నుండి ఇయర్ బడ్స్ లేదా మరొక చిన్న స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. అత్యవసర సమయంలో ఛార్జర్ అందుబాటులో లేనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.
2. డేటాను వేగంగా బదిలీ చేయండి: క్విక్ షేర్ లేదా ఎయిర్‌డ్రాప్ వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ, పెద్ద ఫైల్స్‌ను బదిలీ చేయడానికి అవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అటువంటప్పుడు రెండు ఫోన్లను టైప్-సి కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తే, డేటా ఎంతో వేగంగా మరియు ఎటువంటి అంతరాయం లేకుండా ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు బదిలీ అవుతుంది.
3. ఫోన్‌ను ల్యాప్‌టాప్‌లా వాడండి: మీరు మీ ఫోన్‌ను చిన్న ల్యాప్‌టాప్‌లా మార్చుకోవచ్చు. టైప్-సి పోర్ట్‌కు ఒక OTG అడాప్టర్ లేదా బ్లూటూత్ డోంగిల్ కనెక్ట్ చేయడం ద్వారా వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్‌ను మీ ఫోన్‌తో వాడుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ టచ్ స్క్రీన్ పని చేయకపోయినా, మౌస్ కనెక్ట్ చేసి ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు.
4. టీవీకి కనెక్ట్ చేసి సినిమాలు చూడండి: HDMI టు టైప్-సి కేబుల్ ఉపయోగించి మీ ఫోన్‌ను టీవీకి కనెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా మీ ఫోన్ స్క్రీన్‌ను టీవీలో చూస్తూ సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను పెద్ద తెరపై ఆస్వాదించవచ్చు.
5. వైర్డ్ ఇయర్ బడ్స్‌తో హై-క్వాలిటీ మ్యూజిక్: చాలా ఫోన్లలో ఇప్పుడు 3.5mm ఆడియో జాక్ ఉండటం లేదు. కానీ టైప్-సి పోర్ట్ ద్వారా వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ను కనెక్ట్ చేయవచ్చు. వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్‌లో ఆడియో క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది. గేమింగ్ ఇష్టపడే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనికోసం టైప్-సి కనెక్టర్ ఉన్న ఇయర్ ఫోన్స్ లేదా టైప్-సి టు 3.5mm అడాప్టర్ అవసరం.


































