ఇక నాలుగే ప్రభుత్వ బ్యాంక్‌లు.

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను భారీగా కుదించాలని మోడీ సర్కార్‌ నిర్దేశించుకుంది. ఇందుకోసం బ్యాంక్‌ల విలీన ప్రక్రియను మరోమారు వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పిఎస్‌బి)లు ఉన్నాయి. వీటిని నాలుగింటికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్ల క్రితం 27 పిఎస్‌బిలు ఉండగా.. వీటిని డజన్‌కు పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం 2026-2027 మార్చి ముగింపు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్‌ కసరత్తు చేస్తోంది. అదే జరిగితే పిఎస్‌బిల్లో వాటాల విక్రయం మరింత సులభం కానుంది. అదే విధంగా ఈ రంగంలో విలీనాల ద్వారా ఉద్యోగ అవకాశాలు భారీగా పడిపోనున్నాయని బ్యాంకింగ్‌ సంఘాలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల ప్రకారం.. 2027 మార్చి కల్లా 12 బ్యాంక్‌లను నాలుగింటికి తగ్గించాలనేది ప్రధాన యోచన. విలీనం అనంతరం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి)తో పాటు కెనరా, యూనియన్‌ బ్యాంక్‌ విలీనం తర్వాత ఏర్పడే మరో బ్యాంక్‌ మాత్రమే మిగలనున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ అంశం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు మనీకంట్రోల్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా బ్యాంకులను తీర్చిదిద్దాలనే సాకుతో కేంద్రం విలీన ప్రయత్నాలు చేస్తోందని స్పష్టమవుతోంది. తొలుత చిన్న బ్యాంకులను కాస్త పెద్ద బ్యాంకులతో విలీనం చేసేలా సర్కార్‌ ప్రణాళికలు రూపొందిస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి తెలిపారు. మొత్తంగా పిఎస్‌బిలను నాలుగుకు తగ్గించడం ప్రణాళికలో భాగమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రణాళిక ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉందన్నారు. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం క్యాబినెట్‌కు, ప్రధాని మంత్రి కార్యాలయానికి చేరనుంది.
ప్రభుత్వరంగ బ్యాంకులైన కెనరా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బిఒఐ)లను విలీనం చేసి ఒక్క బ్యాంక్‌గా ఏర్పాటు చేసే యోచన చేసింది. ఇక ఇండియన్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌ కలిసి విలీనం చేసి ఎస్‌బిఐ, పిఎన్‌బి, బిఒబిలో విలీనం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఒబి), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బిఒఐ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) సంస్థలను ఎస్‌బిఐ, పిఎన్‌బి, బిఒబిల్లో విలీనం కానున్నాయి. పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు గురించి ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిని నాలుగింటిలో ఏదో ఒక దాంట్లో విలీనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 2017 నుంచి 2020 కాలంలో 27 పిఎస్‌బిలను 12 బ్యాంక్‌లకు తగ్గించారు. దీంతో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోయాయి. మరోవైపు పిఎస్‌బిల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచేలా ఇటీవల కొత్త ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎఫ్‌డిఐల పరిమితి 20 శాతంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను క్రమంగా ప్రయివేటు, విదేశీపరం చేసేలా మోడీ సర్కార్‌ కుట్రల్లో ఇదో భాగమని బ్యాంకింగ్‌ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.