అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఇవే.. నవరాత్రుల్లో పూజిస్తే దుర్గమ్మ అనుగ్రహం మీ సొంతం

 సంవత్సరం శరన్నవరాత్రి వేడుకలను జరుపుకునే సమయం ఆసన్నం అయింది. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. అయితే అమ్మవారి స్వరూపంగా భావించి పూజించే ఒకొక్క దేవతకు ఒకొక్క పువ్వు అంటే ఇష్టం.


నవరాత్రి తొమ్మిది రోజులలో భక్తులు ఒకొక్క రోజున ఒకొక్క దేవత స్వరుపని పూజిస్తారు. ఆ అమ్మవారికి ఇష్టమైన రంగుల దుస్తులు ధరిస్తారు. నైవేద్యాన్ని సమర్పిస్తారు. అంతేకాదు.. అమ్మవారికి ఇష్టమైన పువ్వులను సమర్పిస్తే.. కూడా అదృష్టం, శ్రేయస్సు పొంది.. కష్టాల నుంచి విముక్తిని పొందుతారు. ఈ రోజు తొమ్మిది దేవతలకు ఇష్టమైన తొమ్మిది పువ్వులు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

  1. మొదటి రోజు శైలపుత్రి: నవరాత్రి శైలపుత్రి పూజతో ప్రారంభమవుతుంది. తెల్లటి కమలం లేదా తెల్లటి పువ్వును సమర్పించడం ఆమెను పూజించడానికి ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ఈ రంగు పువ్వులను సమర్పించడం వల్ల జీవితానికి శాంతి, స్థిరత్వం లభిస్తుంది.
  2. రెండవ రోజు బ్రహ్మచారిణి: గులాబీలు, మల్లెపూలు తపస్సుకు ప్రతీక అయిన బ్రహ్మచారిణికి చాలా ప్రియమైనవి. ఈ పువ్వులను సమర్పించడం వలన భక్తుని భక్తి , ఏకాగ్రత బలపడుతుంది.
  3. మూడవ రోజు చంద్రఘంట: ధైర్యం, శౌర్య దేవత అయిన చంద్రఘంటకు బంతి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆమెకు బంతి పువ్వులు సమర్పించడం వల్ల శత్రువులపై విజయం, ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
  4. నాల్గవ రోజు కూష్మాండ దేవి: విశ్వానికి అధిష్టాన దేవత అయిన కూష్మాండ దేవికి ఎర్ర మందార సమర్పించడం ఉత్తమం. అమ్మ ఆశీర్వాదంతో ఆరోగ్యం, తేజస్సు , దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం.
  5. ఐదవ రోజు స్కందమాత: పిల్లల ఆనందాన్ని ఇచ్చే స్కందమాతకు కమలం అంటే చాలా ఇష్టం. కమల పువ్వును సమర్పించడం వల్ల ఇంటికి శ్రేయస్సు , పిల్లలకు శ్రేయస్సు లభిస్తుంది.
  6. ఆరవ రోజు కాత్యాయనీ దేవి: బాలిక రూపంలో ఉన్న కాత్యాయనికి కదంబ పువ్వును సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన కన్యకు తగిన జీవిత భాగస్వామి లభిస్తుందని, వైవాహిక ఆనందాన్ని సాధించడంలో సహాయపడుతుందని నమ్మకం.
  7. ఏడవ రోజు కాళరాత్రి: భయాన్ని, శత్రువులను నాశనం చేసే కాళరాత్రి అమ్మవారికి మల్లి పువ్వులు, నీలం రంగు కృష్ణ తామర పువ్వు, మందార పువ్వులు అంటే ఇష్టం. ఈ పువ్వులను అర్పించడం వల్ల ప్రతికూల శక్తి, భయాన్ని దూరం చేస్తుంది.
  8. ఎనిమిదవ రోజు మహాగౌరి: స్వచ్ఛత, అందానికి దేవత అయిన మహాగౌరికి తెల్లని మల్లెలు, గులాబీ పువ్వులు సమర్పించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇది జీవితానికి ఆనందం, సంతృప్తిని తెస్తుంది.
  9. తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి: విజయాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే సిద్ధిదాత్రి దేవికి నీలి కమలం లేదా మల్లెను సమర్పించడం వలన జీవితంలో విజయం, దైవిక శక్తి వస్తుంది.

నవరాత్రి సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను వారికి ఇష్టమైన పూలతో పూజించడం వల్ల భక్తులకు అదృష్టం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. ఈ నవరాత్రిలో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పువ్వులను సమర్పించడం ద్వారా అమ్మవారి ఆశీస్సులను పొందవచ్చు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.