ఈ ఏడాది భారీ డిజాస్టర్లుగా నిలిచిన చిత్రాలు ఇవే

ప్రతి నెలా, ప్రతి వారం థియేటర్లలోకి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తూనే ఉంటాయి. ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ ప్రేక్షకుల ముందు వచ్చాయి.


కాగా మరో మూడు రోజులలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్న తరుణంలో.. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయం సాధించిన చిత్రాలు అంటే తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. విజయాల కంటే పరాజయాలే సినీ పరిశ్రమకు అధికంగా ఎదురయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ప్రేక్షకుల దృష్టిలో ‘చెత్త సినిమాలు’గా ముద్ర వేయించుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌కు భారీ నష్టాలను మిగిల్చిన 10 పెద్ద డిజాస్టర్ చిత్రాలు ఏంటో తెలుసుకుందాం. ఈ జాబితాలో స్టార్ హీరోల చిత్రాలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. పలు చిత్రాలు నిర్మాతలకు కోలుకోలేని నష్టాలను మిగిలిస్తే.. మరి కొన్ని అయితే ప్రొడక్షన్ ఫుడ్ ఖర్చులను కూడా తెచ్చిపెట్టలేదనే అపవాదు మూటగట్టుకున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

టాప్ 10 డిజాస్టర్ సినిమాలు ఇవే..

1. గేమ్ ఛేంజర్..

ఈ లిస్టులో ముందుగా గత సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఉంది. రామ్ చరణ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం చివరికి రూ.100 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసి అతిపెద్ద పరాజయాలలో ఒకటిగా నిలిచింది.

2. హరిహర వీరమల్లు..

పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ చిత్రంపై విడుదల ముందు పెద్దగా ప్రచారం (బజ్) లేదు. దాదాపు రూ.300 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా.. కేవలం రూ.60 కోట్లు మాత్రమే షేర్ రూపంలో రాబట్టి, ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్‌లలో ఒకటిగా నమోదైంది.

3. అఖండ 2..

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “అఖండ 2”. కాగా ‘అఖండ’ మూవీకి సీక్వెల్ గా వచ్చింది ఈ చిత్రం. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. అయితే ప్రారంభంలో ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చినా.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేక పంపిణీదారులకు భారీ నష్టాలను మిగిల్చింది.

4. మాస్‌ జాతర..

ఈ జాబితాలో చిత్రం రవితేజ నటించిన ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి సానుకూల అంచనాలే క్రియేట్ అయ్యాయి. కానీ విడుదలయ్యాక డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.10 కోట్ల లోపే షేర్‌ను కలెక్ట్ చేసింది.

5. కన్నప్ప..

భారీ తారాగణంతో మంచు విష్ణు హీరోగా వచ్చిన సినిమా ‘కన్నప్ప’. విడుదల ముందు మాత్రం ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ దాదాపు 20 నిమిషాల నిడివితో అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారాన్ని మరింత పెంచింది. అయితే చివరికి సినిమా డిజాస్టర్ అయింది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం కేవలం రూ.25 కోట్లను మాత్రమే సేకరించి, బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

6. కింగ్‌డమ్..

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్‌డమ్’ కూడా ఈ ఏడాది డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరింది. నిజానికి ఈ సినిమాపై విడుదల ముందు విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆడియెన్స్ అంచనాలను అందుకోలేక, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరాజయం పాలైంది. రూ. 130 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం కేవలం రూ.50 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

7. ఆంధ్రా కింగ్ తాలూకా..

రామ్ పోతినేని నటించిన ఈ సినిమా మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది.

8.తమ్ముడు..

నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తమ్ముడు’ చిత్రం ఈ ఏడాది అత్యంత భారీ పరాజయాలలో ఒకటిగా నిలిచింది. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, కేవలం రూ.4 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

9.ఘాటీ..

క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన చిత్రం ‘ఘాటీ’. థియేటర్ల వద్ద చాలా మంది ప్రేక్షకులు ఇంటర్వెల్ వద్దే బయటకు వచ్చారంటే, ఈ సినిమా ఎంతగా నిరాశపరిచిందో చెప్పనవసరం లేదు. సుమారు రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.3 కోట్ల షేర్‌ను మాత్రమే కలెక్ట్ చేసింది.

10.జాక్..

‘టిల్లూ స్క్వేర్’ చిత్రంతో రూ.120 కోట్లు వసూలు చేసిన సిద్ధు.. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌తో కలిసి ‘జాక్’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాపైనా ముందు నుంచి ప్రజల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలయ్యాక ఇది ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా కేవలం రూ.4 కోట్లను మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ 10 చిత్రాలే కాకుండా, ఈ ఏడాది ఇంకా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలిచాయి. అయితే, వాణిజ్యపరంగా నిర్మాతలకు అత్యంత భారీ నష్టాలను మిగిల్చింది మాత్రం ఈ 10 చిత్రాలే.

వీటితో పాటు బ్రహ్మానందం, లైలా, మజాకా, షణ్ముఖ, ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, సారంగపాణి, సుందరకాండ, 12 A రైల్వే కాలనీ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.