ఖరీదైన ఫుడ్స్ గురించి మాట్లాడేటప్పుడు.. బంగారు పూత పూసిన స్వీట్లు లేదా ఖరీదైన పండ్లు వస్తాయి. కానీ ఇండియాలో కొన్ని కాస్ట్లీ కూరగాయలు కూడా ఉన్నాయి.
అవి చాలా అరుదైనవి. అంతేకాకుండా విలువైనవి. వాటి ధర లగ్జరీ వాచ్లతో పోటీ పడగలదు. ఇంతకీ ఆ కూరగాయలేంటో.. వాటి ధరలు ఎంతో చూసేద్దాం.
భారతదేశంలో అత్యంత ఖరీదైన కూరగాయ
హాప్ షూట్స్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన కూరగాయలలో ఒకటి. భారతీయ మార్కెట్లలో దీని ధర కిలోగ్రాముకు 85,000 నుంచి 1,00,000 వరకు ఉండవచ్చు. ఇవి ప్రధానంగా బీహార్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని పరిమిత ప్రాంతాలలో కనిపిస్తాయి. వాటిని పండించడం చాలా కష్టం. ఈ మొక్కలు సరళ రేఖలలో పెరగవు. అందువల్ల యంత్రాలతో కోయడం అసాధ్యం.
రైతులు ప్రతి హాప్ షూట్ను విడిగా గుర్తించి చేతితో తుంచాలి. ఈ మొత్తం ప్రక్రియకు చాలా సమయం, శ్రమ పడుతుంది. 1 కిలోగ్రాము సేకరించడానికి వందలాది హాప్ షూట్స్ అవసరం. హ్యూములన్, లుపులోన్ వంటి సహజ ఆమ్లాలు ఇందులో ఉండటం వల్ల ఇది చాలా ఖరీదైనది. ఈ రెండు ఆమ్లాలు క్యాన్సర్ కణాలు, TB వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
గుచ్చి పుట్టగొడుగులు
గుచ్చి పుట్టగొడుగులు సహజంగా పెరిగే అత్యంత ఖరీదైన కూరగాయగా చెప్తారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని అడవులలో కనిపించే ఈ కూరగాయ ధర కిలోగ్రాముకు 30,000 నుంచి 40,000 మధ్య ఉంటుంది. దీనిని ఎక్కువమంది పండించలేకపోవడం వల్ల ఇది చాలా ఖరీదైనదిగా మారిందని చెప్తారు. ఇతర పుట్టగొడుగుల వలె కాకుండా గుచ్చి ప్రత్యేక సహజ పరిస్థితులలో మాత్రమే పెరుగుతుంది. ఇది సాధారణంగా చల్లని పర్వత ప్రాంతాలలో మంచు కురిసిన తర్వాత, తుఫానుల తర్వాత పెరుగుతుంది.
ఆరోగ్య ప్రయోజనాల వల్లే డిమాండ్
గుచ్చి పుట్టగొడుగులు ఖరీదైనవి మాత్రమే కాదు. చాలా పోషకమైనవి కూడా. వాటిలో ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయ గుండె జబ్బులు, డయాబెటిస్ను నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
ఈ రెండు కూరగాయలు చాలా తక్కువ పరిమాణంలో లభించడం వల్ల చాలా ఖరీదైనవి. అదే సమయంలో ఒక కూరగాయ చాలా నెమ్మదిగా, సున్నితమైన సాగుపై ఆధారపడి ఉంటుంది. మరొకటి పూర్తిగా సహజ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.



































