కొత్త ఎగ్జామ్ సెంటర్స్ ఇవే

ఇంజినీరింగ్‌ ఆశావహులకు కీలక అలర్ట్‌! దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్‌ సంస్థల్లో బీటెక్‌, బీఆర్క్‌ సీట్లకు మార్గం వేసే జేఈఈ మెయిన్స్‌-2026 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈసారి పరీక్షకు దాదాపు 14.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం విశేషం. భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాయనున్న నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 3 కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అంచనా.


ఈ నెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్‌-1 (బీఈ/బీటెక్‌) పరీక్షలు నిర్వహించనుండగా, 29న పేపర్‌-2 (బీఆర్క్‌/బీప్లానింగ్‌) జరుగుతుంది. పరీక్షలు రోజుకు రెండు షిఫ్ట్‌లలో కంప్యూటర్‌ ఆధారితంగా జరుగుతాయి. ఉదయం షిఫ్ట్‌ 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్‌ 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం పరీక్ష రాసే విద్యార్థులను 7.30 నుంచి 8.30 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్ట్‌కు 1.30 నుంచి 2.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

సూచనలు..

విద్యార్థుల సౌకర్యం కోసం ఈసారి పరీక్షను తెలుగు, ఆంగ్లంతో పాటు మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే వారు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డును ప్రింట్‌ తీసుకొని, అందులో పేర్కొన్న విధంగా ఫొటో అతికించి, వేలిముద్ర వేయాలి. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఒరిజినల్‌ గుర్తింపు కార్డు, ఒక పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. పెద్ద బటన్లు ఉన్న చొక్కాలు, నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాలకు వస్తే అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అడ్మిట్‌ కార్డులో ఉన్న సూచనలను పూర్తిగా చదివి పాటించాలని సూచించారు.

ఏపీలో కొత్త సెంటర్లు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఉన్న అనంతపురం, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, నెల్లూరు, కాకినాడ వంటి కేంద్రాలతో పాటు ఈసారి ఆదోని, అమలాపురం, మదనపల్లి, మార్కాపురం, పుత్తూరు, రాయచోటి, తాడిపర్తి, తిరువూరు కొత్తగా చేరాయి.

తెలంగాణలో..

తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ వంటి కేంద్రాలు ఉండగా, ఈసారి ఆదిలాబాద్‌, కోదాడ, పెద్దపల్లిలను కొత్తగా చేర్చారు. మొత్తంగా జేఈఈ మెయిన్స్‌-2026 విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్ష కావడంతో, అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకుని, నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎన్‌టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.