UPI, RuPay యూజర్లకు పెద్ద షాక్.. ఇప్పుడు జేబుకు చిల్లు లాంటిది.. కొత్త రూల్స్ ఇవే

ఇప్పుడంతా యూపీఐ యుగమే. ఎక్కడ చూసినా అందరూ యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తున్నారు. చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు, ప్రతి చోటా ఇది ప్రధాన చెల్లింపు మార్గంగా మారిపోయింది. నగదు తక్కువగా ఉండటం, పేమెంట్ చేయడానికి వేళ్లాడాల్సిన అవసరం లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రజలందరూ దీని వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వీరందరికి పెద్ద షాక్‌. ఇప్పటి వరకు మనం ఉచితంగా, ఎలాంటి అదనపు ఛార్జీలూ లేకుండా లావాదేవీలు చేసుకుంటూ వచ్చాం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగం, ఫిన్‌టెక్ కంపెనీలు తిరిగి యూపీఐ చార్జీలను తీసుకురావాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.


బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీల ఒత్తిడితో తిరిగి MDR..

2022 ముందు వరకు పెద్ద వ్యాపారస్తులు యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తే, బ్యాంకులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చెల్లించాల్సి వచ్చేది. కానీ ఆ తరువాత ప్రభుత్వం ఈ ఛార్జీలను పూర్తిగా తీసివేసింది. దీని వలన వినియోగదారులకు మరింత లబ్ధి కలిగింది. కానీ, ఇప్పుడు బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు తిరిగి MDR ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఫిన్‌టెక్ సంస్థలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ తమ వ్యాపారాలను కొనసాగించాలంటే MDR అవసరమనే వాదన చేస్తున్నాయి. గతంలో ప్రభుత్వం బ్యాంకులకు, ఫిన్‌టెక్ కంపెనీలకు యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చేది. కానీ, ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఆ సబ్సిడీ రూ.3,500 కోట్ల నుంచి కేవలం రూ.437 కోట్లకు తగ్గించేశారు. దీని వల్ల వ్యాపారులు తాము స్వయంగా ఈ ఖర్చులను భరించలేమని మళ్లీ MDR తీసుకురావాల్సిందేనని కోరుతున్నారు.

యూజర్లపై ప్రభావమెంత..

ప్రస్తుతం వినియోగదారులపై ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోయినా, వ్యాపారస్తులు ఈ ఖర్చును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమ వినియోగదారులపై పెట్టే అవకాశం లేకపోలేదు. అంటే, మీ షాపింగ్ బిల్, హోటల్ బిల్ లేదా ఏదైనా సేవలకు మీరు భవిష్యత్తులో అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. ఇదంతా కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంది. అయితే, పెద్ద వ్యాపారస్తులకైనా MDR విధిస్తే, చిన్న వ్యాపారాలకూ ఇది వర్తిస్తుందా? వినియోగదారుల పైన దీని ప్రభావం ఏమిటి? ఇక మీదట ఉచిత యూపీఐ అనేది కొనసాగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.