మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో కిడ్నీలు ప్రధానమైనవి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసే నేచురల్ ఫిల్టర్లుగా పనిచేస్తాయి. శరీరం నుండి విషతుల్యాలను, వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.
అయితే కిడ్నీలు పాడవుతున్నాయని మన శరీరం ముందే కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ముందుగానే గుర్తిస్తే ప్రమాదం నుండి బయటపడవచ్చు.
నిపుణులు ఏమంటున్నారు?
నిపుణుల ప్రకారం కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణం నిర్లక్ష్యం. కిడ్నీ సమస్య ప్రారంభ దశలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి. దాదాపు 90శాతం మంది ప్రజలు వీటిని సాధారణ అలసటగానో, చిన్నపాటి అనారోగ్యంగానో భావించి విస్మరిస్తారు.
కానీ ఆ చిన్న లక్షణాలే కిడ్నీ వైఫల్యానికి హెచ్చరికలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రాత్రిపూట కనిపించే ఈ 5 సంకేతాలను అస్సలు విస్మరించకూడదని సూచిస్తున్నారు.
కిడ్నీ వైఫల్యాన్ని సూచించే 5 రాత్రిపూట సంకేతాలు
రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన
మీకు రాత్రిపూట నిద్రలో తరచుగా మెలకువ వస్తోందా? మాటిమాటికీ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తోందా? అయితే ఇది కిడ్నీ డ్యామేజ్ కి తొలి సంకేతం కావచ్చు.
కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గినప్పుడు, రాత్రిపూట మూత్ర విసర్జన పెరగడం సహజం. కొన్నిసార్లు మూత్రం లీకేజ్ సమస్య కూడా తలెత్తవచ్చు.
పాదాలు, చేతుల్లో వాపు
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని అదనపు ఉప్పు (సోడియం), నీరు బయటకు పోలేక శరీరంలోనే నిలిచిపోతాయి. దీని ప్రభావం గురుత్వాకర్షణ కారణంగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ఫలితంగా పాదాలు, చీలమండలు, కొన్నిసార్లు చేతుల్లో కూడా వాపు కనిపిస్తుంది. ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు ఉండటం కూడా దీని లక్షణమే.
తీవ్రమైన చర్మపు దురద
రాత్రిపూట చర్మం విపరీతంగా దురద పెడుతోందా? ఇది సాధారణ చర్మ సమస్య కాకపోవచ్చు. కిడ్నీలు రక్తాన్ని సరిగా శుభ్రం చేయలేనప్పుడు విష పదార్థాలు రక్తంలో పేరుకుపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారిపోవడం, తీవ్రమైన దురద, మంట, దద్దుర్లు వంటివి రాత్రిపూట ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.
నిద్రలేమి, అలసట
ఆరోగ్యకరమైన కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కానీ అవి విఫలమైనప్పుడు టాక్సిన్స్ రక్తంలోనే ఉండిపోతాయి. ఈ విషతుల్యాల ప్రభావం మెదడుపై పడి నిద్రలేమి సమస్య తలెత్తుతుంది.
ఎంత ప్రయత్నించినా నిద్రపట్టకపోవడం, రాత్రిపూట విపరీతమైన అలసట, బలహీనత, ఊపిరి ఆడనట్లు అనిపించడం కిడ్నీ వైఫల్యానికి సంకేతాలు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
కిడ్నీ సమస్య తీవ్రమైనప్పుడు ఊపిరితిత్తులలో ద్రవాలు చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల రాత్రిపూట పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.
ఛాతీలో నొప్పి లేదా బరువుగా అనిపించడం కూడా జరుగుతుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించుకోవాలి































