TOP IITs and NITs : జేఈఈ ‘అడ్వాన్స్‌డ్‌’ ముగిసింది.. దేశంలో టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలు ఇవే..

TOP IITs and NITs : జేఈఈ ‘అడ్వాన్స్‌డ్‌’ ముగిసింది.. దేశంలో టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలు ఇవే..


దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఆదివారం (మే 26న) ముగిసింది. ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ జూన్‌ 2న అధికారులు విడుదల చేయనున్నారు. జూన్‌ 2 నుంచి 3 వరకు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తుది కీ, ఫలితాలను జూన్‌ 9న విడుదల చేస్తారు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్‌ ఐఐటీ, ఎన్‌ఐటీలను ఓసారి పరిశీలిస్తే..

గతేడాది నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌(NIRF) ప్రకారం కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ (NIRF Rankings 2023) ప్రకారం .. దేశంలో అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఐఐటీ మద్రాస్ (IIT Madras) మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా ఐదో ఏడాదీ తొలి స్థానంలోనే నిలిచి ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ దిల్లీ రెండో స్థానంలో ఉంది. అలాగే, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యాసంస్థల్లో అంతర్జాతీయంగా టాప్‌ 50లో ఒకటిగా సత్తా చాటింది.

ఐఐటీ బాంబే NIRF ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ కాన్పూర్‌ (నాలుగు), ఐఐటీ ఖరగ్‌పుర్‌ (ఐదు), ఐఐటీ రూర్కీ(ఆరు), ఐఐటీ గువాహటి (ఏడు), ఐఐటీ హైదరాబాద్‌ (8) నిలిచాయి. ఎన్‌ఐటీ తిరుచ్చి తొమ్మిదో ర్యాంకు, ఎన్‌ఐటీ కర్ణాటక (12), ఎన్‌ఐటీ రౌర్కెలా (16), ఎన్‌ఐటీ వరంగల్‌ (21), ఎన్‌ఐటీ కాలికట్‌ 23వ ర్యాంకుల్లో మెరిశాయి. ఇకపోతే, క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌- 2024 జాబితాలోనూ ఐఐటీ బాంబే చోటు దక్కించుకోగా.. గ్లోబల్‌ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ కాన్పూర్‌ 93వ ర్యాంకులో నిలిచింది.