బెంగళూరుకు చెందిన ఈ ముగ్గురు చిన్నారులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ఈ పిల్లలు ఏం చేశారో తెలిస్తే మీరు శభాష్ అనక మానరు. ఈ చిన్నారులు పదేళ్లు కూడా నిండకుండానే ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు తమ వ్యాపారంలో పెద్ద పీఠ వేశారు. ఎకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగులు తయారు చేసి అమ్ముతున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. బెంగళూరులోని బసవేశ్వర నగర్‌కు చెందిన శారద అనే బాలిక ‘ఎకో వాలా’ పేరిట పేపర్ బ్యాగుల తయారీ సంస్థను స్టార్ చేసింది.
తన వ్యాపారంలో నచికేత అనే బాలుడ్ని మేనేజర్‌గా.. సముద్యత అనే బాలికను కో మేనేజర్‌గా పెట్టుకుంది. ఈ ముగ్గురి వయసు 10 సంవత్సరాల లోపే కావటం విశేషం. శారద, నచికేత, సముద్యత ఇంటి ఇంటికి తిరిగి తమ ఎకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగులను అమ్ముతున్నారు. ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఇంతకీ ఏముందంటే..
శారద తమ బిజినెస్ గురించి ఆ వ్యక్తికి వివరిస్తూ.. ‘ఇది శాంపిల్ పేపర్ బ్యాగ్.. దీన్ని ఇలా ఓపెన్ చేయవచ్చు. మేము మంత్లీ సబ్‌స్క్రిప్షన్ మీద బ్యాగ్స్ అందిస్తున్నాము. నెలకు పది రూపాయలు చెల్లించాలి. ప్రతీ ఆదివారం మీ ఇంటి దగ్గరకు 2 బ్యాగులు తీసుకువచ్చి ఇస్తాము. మీ అడ్రస్ ఇస్తే చాలు. మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు ఇంకా ఎక్కువ పేపర్ బ్యాగ్స్ తెచ్చి ఇస్తాము’ అని చెప్పింది. తమ ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన పేపర్ ముక్కను అతడికి ఇచ్చింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు చిన్నారులపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
































