నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ

సీరియల్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన నటుడు రవికృష్ణ. మొగలిరేకులు సీరియల్‌తో బుల్లితెరకు పరిచమైన రవికి బిగ్‌బాస్‌ షోతో మరింత గుర్తింపు వచ్చింది.


షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా చాన్స్‌లు వచ్చాయి. విరూపాక్ష సినిమా రవి కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత రవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల విడుదలైన దండోరాలో కీలక పాత్ర పోషించాడు. కులం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి..తక్కువ కులానికి చెందిన యువకుడిగా నటించాడు. అగ్ర కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. ఆమె కులం వాళ్ల చేతిలో హత్యకు గురవుతాడు. సినిమా ప్రేక్షకులు రవి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందంటున్నారు రవి. దండోరా సినిమాలో మాదిరే తాను కూడా కుల వివక్షకు గురయ్యాడట. తన కులం చూసి సినిమా చాన్స్‌లు ఇవ్వలేదట.

తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో​ రవి తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు. ‘మాది విజయవాడ. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా కంటే ముందు మా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు. నాకు సినిమాలంటే పిచ్చి. కానీ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇంటర్‌ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళతా అంటే..ఇంట్లో తిట్టారు. దీంతో డిగ్రీ చేసి.. సినిమాల్లోకి వచ్చాడు.

సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలియక..చెన్నై వెళ్లాను. అక్కడ ఓ సీరియల్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశా. కొన్నాళ్ల తర్వాత వాళ్లే ఓ తెలుగు సీరియల్‌ చేస్తే..అందులో నటించాడు. అది మూడు నెలలకే ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలుసుకొని.. ఇక్కడకు వచ్చాడు. మా మేనత్త వాళ్ల ఇంట్లో ఉంటూ.. అవకాశాల కోసం తిరిగాను. మొగలి రేకులు సీరియల్‌కి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వెళ్లే..అప్పటికే పూర్తయిపోయానని చెప్పారు. వాళ్లను రిక్వెస్ట్‌ చేసి ఆడిషన్స్‌ ఇచ్చాను. అలా ఆ సీరియల్‌తో నా కెరీర్‌ ప్రారంభం అయింది. ఆ ఫేమ్‌తో సినిమాల్లోకి వచ్చాయి.

ఇక్కడ నాకు కుల వివక్ష ఎదురైంది. కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్‌ చేసి.. చివరిలో నా కులం చూసి పక్కకు తప్పించారు. ఓ సినిమాకి హీరోగా సెలెక్ట్‌ అయ్యాను. అగ్రిమెంట్‌ సమయంలో నా ఆధార్‌ కార్డు పంపించా. అ‍క్కడ నా కులం చూసి.. తప్పించారు. కారణం ఏంటని అడిగితే.. ఈ కథ మీకు సెట్‌ కాదు.. ఇంకో ప్రాజెక్ట్‌కి చూద్దాం అని చెప్పేవాళ్లు. అలా మూడు సినిమాలు అగ్రిమెంట్‌ వరకు వచ్చి..కులం చూసి ఆగిపోయాయి’ అని రవి చెప్పుకొచ్చాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.