క్రెడిట్​ కార్డు అవసరం లేకుండానే మీ క్రెడిట్​ స్కోర్​ని ఇలా పెంచుకోండి.

క్రెడిట్​ కార్డు లేకుండానే క్రెడిట్​ స్కోర్​ని పెంచుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఇందుకోసం 5 మార్గాలు ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతాయి.

ప్రస్తుత ఆర్థిక ప్రపంచంలో మంచి క్రెడిట్ స్కోర్ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు! అది ఎన్నో ఆర్థిక అవకాశాలకు డోర్లు తెరిచే తాళం లాంటిది! కానీ ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు లేకపోతే మంచి క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించుకోవడం సాధ్యమేనా? కచ్చితంగా సాధ్యమే. క్రెడిట్ కార్డు ఉపయోగించకుండానే మీ క్రెడిట్ స్కోర్​ని పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము..


క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు..

ఏం చేయాలో తెలుసుకునే ముందు, క్రెడిట్ స్కోర్​ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం ముఖ్యం..

సమయానికి చెల్లింపులు: ఇది అత్యంత ముఖ్యమైన అంశం. మీ రుణాలు, ఈఎంఐలను సకాలంలో చెల్లించడం మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది.

క్రెడిట్ వినియోగం: మీరు ఎంత క్రెడిట్‌ను ఉపయోగించుకుంటున్నారు? మీకు ఎంత అందుబాటులో ఉంది? అనే నిష్పత్తి ఇది. తక్కువగా ఉంటే మంచిది.

క్రెడిట్ హిస్టరీ నిడివి: మీ క్రెడిట్ హిస్టరీ ఎంత పాతది అయితే, అది అంత మంచిదిగా పరిగణిస్తారు.

క్రెడిట్ మిక్స్: సెక్యూర్డ్​, అన్​సెక్యూర్డ్​ లోన్​ల సరైన కలయిక మీ విశ్వసనీయతను పెంచుతుంది.

కొత్త రుణాల కోసం దరఖాస్తులు: తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేస్తే, అది మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

క్రెడిట్ కార్డు లేకుండా స్కోర్ పెంచుకోవడానికి 5 మార్గాలు..

1. ప్రస్తుత రుణాలను సకాలంలో చెల్లించడం:

మీరు ఇప్పటికే తీసుకున్న ఏదైనా రుణాన్ని (ఉదాహరణకు, పర్సనల్ లోన్, వెహికల్ లోన్) సకాలంలో తిరిగి చెల్లించడం అత్యంత సులభమైన మార్గం. క్రమం తప్పకుండా చెల్లింపులు చేయడం వల్ల మీ ఆర్థిక క్రమశిక్షణ రుజువవుతుంది. ఒకవేళ ఆలస్యంగా చెల్లిస్తే మీ స్కోర్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

2. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ తీసుకోవడం:

ఎలక్ట్రానిక్స్ లేదా గృహోపకరణాల కోసం చాలా సులభంగా కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ లభిస్తుంది. ముఖ్యంగా ఎన్​బీఎఫ్​సీల నుంచి ఇలాంటి రుణాలు తీసుకోవడం సులభం. ఈ రుణాలకు సంబంధించిన ఈఎంఐలను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ చరిత్రను నిర్మించుకోవచ్చు.

3. సెక్యూర్డ్ లోన్ తీసుకోవడం:

బంగారం, ఆస్తులు వంటివి తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను సెక్యూర్డ్ లోన్ అంటారు. వీటిని సులభంగా పొందవచ్చు. ఈ రుణాలను సక్రమంగా తిరిగి చెల్లిస్తే, అది మీ క్రెడిట్ ప్రొఫైల్​ని మెరుగుపరుస్తుంది.

4. చిన్న మొత్తంలో పర్సనల్ లోన్ తీసుకోవడం:

చిన్న మొత్తంలో పర్సనల్ లోన్ తీసుకుని, దాని ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ హిస్టరీని ప్రారంభించవచ్చు. అయితే మీరు సులభంగా చెల్లించగలిగే ఈఎంఐని మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.

5. రుణానికి సహ-దరఖాస్తుదారుగా ఉండటం:

మీ కుటుంబ సభ్యులు తీసుకునే రుణం (ఉదాహరణకు, గృహ రుణం)కు “సహ-దరఖాస్తుదారు”గా ఉండటం ద్వారా కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను వేగంగా పెంచుకోవచ్చు. దీని కోసం రుణ చెల్లింపులు సక్రమంగా జరిగేలా చూసుకోవాలి.

మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోవడానికి మరికొన్ని చిట్కాలు..

క్రెడిట్ రిపోర్టును సమీక్షించండి: మీ రిపోర్టులో తప్పులు ఉంటే అది మీ స్కోర్‌ను తగ్గించవచ్చు. ప్రతీ ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి మీ క్రెడిట్ రిపోర్టును సరిచూసుకోండి.

ఎక్కువ రుణాలకు దరఖాస్తు చేయవద్దు: మీరు రుణం కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ మీ క్రెడిట్ రిపోర్ట్‌పై ఒక “హార్డ్ ఎంక్వైరీ” నమోదవుతుంది. ఇలా చాలా ఎంక్వైరీలు ఉంటే, అది మీ స్కోర్‌కు నష్టం కలిగిస్తుంది.

క్రెడిట్ మిక్స్‌ను నిర్వహించండి: మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరచుకోవడానికి గృహ రుణం వంటి పెద్ద రుణాలు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ వంటి చిన్న రుణాల కలయికను నిర్వహించడం మంచిది.

ఈ విధంగా, మీరు క్రెడిట్ కార్డు లేకుండానే మీ రుణాలను బాధ్యతాయుతంగా నిర్వహించడం, ఆలోచించి రుణాలు తీసుకోవడం, మీ క్రెడిట్‌ను పర్యవేక్షించడం ద్వారా ఒక గొప్ప క్రెడిట్ చరిత్రను నిర్మించుకోవచ్చు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.