ఆదాయంలో ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఒక్కరోజే రూ.27.88 కోట్లు సంపాదించింది.
జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) రూ.27.68 కోట్లతో అత్యధిక ఆదాయాన్ని సంపాదించింది. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే అత్యధికం. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడం ద్వారా, ప్రయాణికుల నుండి మంచి ఆదరణతో ఈ రికార్డు పనితీరుని క్రియేట్ చేసింది. జనవరి 19న రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 50.6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
సంక్రాంతి తర్వాత రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంటికి తిరిగి వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. డిమాండ్ పెరుగుదలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రత్యేక బస్సులను నడిపింది. వైజాగ్ నుంచి కూడా చాలా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపారు అధికారులు. ఈ సేవలను సాధారణ ఛార్జీలతో నడపడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీని ప్రయాణికులు ఎంచుకున్నారు. దీనిద్వారా తమ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేలా చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రైవేట్ రవాణా, వ్యక్తిగత వాహనాల కంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల వైపే చూశారు.
ఆర్టీసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో బస్సులను ముందస్తుగా మోహరించడం, తగినంత మౌలిక సదుపాయాలు కల్పించడం, సమర్థవంతమైన కార్యాచరణ నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ, ప్రయాణికుల డిమాండ్ల ఆధారంగా సేవలను అందించడం ద్వారా రికార్డు ఆదాయం సాధ్యమైందని పేర్కొంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించడంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డిపో, గ్యారేజ్ సిబ్బంది, సూపర్‌వైజర్లు, అధికారులు కీలక పాత్ర పోషించారని ఆ ప్రకటన పేర్కొంది.
సంక్రాంతి సీజన్‌లో సాధించిన విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు ఉద్యోగుల సమిష్టి కృషి, సమన్వయానికి అభినందనలు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలకు అసాధారణ మద్దతు ఇచ్చిన ప్రయాణికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తులో కూడా అదే ప్రోత్సాహం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.




































