తెలుగు వారికి పరిచయం అక్కర్లేని ఆకుకూర గోంగూర. ఆ పేరు చెబితేనే చాలు చాలా మంది నోట్లో నీళ్లూరుతాయి. దాంతో పచ్చడి నుంచి పప్పు వరకు ఎలాంటి వంటకం చేసినా ఆ రుచి వేరే లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ మంది గోంగూరతో పచ్చడి తర్వాత పప్పు చేసుకుంటుంటారు. కానీ, కొందరు మాత్రం ఎప్పుడూ గోంగూర పప్పు చేసినా అందులో పులుపు, ఉప్పు, కారం వీటిలో ఏదో ఒకటి సరిపోక మంచి టేస్ట్ రావట్లేదని ఫీల్ అవుతుంటారు.
అలాంటి వారు ఓసారి ఈ కొలతలతో “గోంగూర పప్పు” చేసుకోండి. మంచి రంగు, రుచితో ఘుమఘుమలాడిపోతూ తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. తయారు చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని నోరూరిపోతుంది! పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు. అంతేకాదు, ఇలా వండారంటే గోంగూరలోని పోషకాలు కూడా తగ్గిపోవు! మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
టిప్స్ :
- ఈ రెసిపీలో ఎండుకారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని చెప్పినన్నే కాకుండా మీ రుచికి సరిపడా తీసుకోవాలి. అప్పుడే పప్పు రుచికరంగా వస్తుంది.
- ఒకవేళ మీకు పచ్చికారం ఇష్టం లేకపోతే మొత్తం ఎండుకారంతో ఈ పప్పుని తయారు చేసుకోవచ్చు.
- మీరు ఇక్కడ పప్పుని నానబెట్టుకుండా డైరెక్ట్‌గా తీసుకున్నట్లయితే నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలని గుర్తుంచుకోవాలి.
- ఇక్కడ పప్పుకి సరిపడా గోంగూరను ఎలా తీసుకోవాలంటే, మీరు ఏదైతే కప్పుతో పప్పుని కొలిచి తీసుకుంటారో దానికి నాలుగింతలు గోంగూర ఆకులను తీసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది.
- పులుపు కాస్త తక్కువగా తినే వారు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోకుండా ఇదే పద్ధతిలో పప్పుని తయారు చేసుకుంటే సరిపోతుంది.
తీసుకోవాల్సిన పదార్థాలు :
పప్పు ఉడికించడం కోసం :
- కందిపప్పు – అర కప్పు(100 గ్రాములు)
- కరివేపాకు – కొద్దిగా
- పసుపు – పావుటీస్పూన్
- పచ్చిమిర్చి – 9 నుంచి 10
- నూనె – 2 టీస్పూన్లు
కర్రీ కోసం :
- గోంగూర – నాలుగు చిన్న కట్టలు
- నూనె – 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు – అరటీస్పూన్
- జీలకర్ర – అరటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 7
- ఎండుమిర్చి – రెండు
- కరివేపాకు – కొద్దిగా
- ఇంగువు – పావుటీస్పూన్
- మీడియం సైజ్ ఉల్లిపాయ – ఒకటి
- పెద్ద టమాటా – ఒకటి
- చింతపండు గుజ్జు – ఒక టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి – మూడు
-
తయారీ విధానం :
- ఈ సూపర్ టేస్టీ పప్పు రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి.
- పప్పు నానేలోపు రెసిపీలోకి కావాల్సిన ఎర్ర గోంగూరను కాడల నుంచి రెండు కప్పుల పరిమాణంలో ఆకులను తుంచుకొని ఒక బౌల్లో వేసుకోవాలి.
- ఆపై శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జల్లిగిన్నెలో వేసి పక్కనుంచాలి. అదేవిధంగా ఉల్లిపాయ, టమాటాను సన్నగా, పచ్చిమిర్చిని చీలికలుగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అరగంటపాటు నానిన కందిపప్పుని వాటర్ వడకట్టి వేసుకోవాలి. ఆపై అందులో ఒకటిన్నర కప్పుల వరకు మంచి నీటిని పోసుకోవాలి.
- అలాగే, కాస్త కరివేపాకు, పసుపు, నూనె, పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని ఒకసారి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- పప్పు చక్కగా ఉడికిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి పప్పుగుత్తి లేదా గరిటెతో మరీ మెత్తగా కాకుండా లైట్‌గా మెదిపి పక్కనుంచాలి.
- ఇప్పుడు పప్పు తయారీకి స్టవ్ మీద కాస్త వెడల్పాటి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి లైట్‌గా ఫ్రై చేయాలి.
- అవి కాస్త వేగాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆ మిశ్రమం చక్కగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆనియన్స్ దోర దోరగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో శుభ్రంగా కడిగి జల్లిగిన్నెలో ఉంచిన గోంగూరను వేసుకొని గరిటెతో కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- అప్పుడు గోంగూర ఆకును కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఆ మిశ్రమంలో మాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు, చింతపండు గుజ్జు, కర్రీకి సరిపడా నీళ్లను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ స్టేజ్‌లో రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కలపాలి. అలాగే, ఇదే టైమ్‌లో టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, పులుపు, కారం అడ్జస్ట్ చేసుకోవాలి.
- ఇక చివర్లో పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్‌లో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకొని వేడి వేడి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఘుమఘుమలాడే కమ్మని “గోంగూర పప్పు” రెడీ!
































