హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజులు విశిష్టతను కలిగి ఉంటాయి. ఆ రోజుల్లో దైవస్మరణ చేయడం వల్ల దేవతల అనుగ్రహం ఉంటుందని భక్తులు నమ్ముతారు.
ఆధ్యాత్మిక మాసం గా పేర్కొనే కార్తీక మాసంలో శివ కేశవులు ఇద్దరికీ పూజలు నిర్వహిస్తారు. అయితే కొన్ని రోజులు శివుడికి.. మరికొన్ని రోజులు విష్ణువుకు పూజలు చేస్తారని ఆధ్యాత్మిక వాదులు చెబుతారు. అయితే శివకేశవులు ఇద్దరికీ ఒకే రోజు పూజ చేసే రోజు ఈ కార్తీకమాసంలో వస్తుంది. ఆ రోజునే శుద్ధ ఏకాదశి అని అంటారు. దీనినే ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. 2025 నవంబర్ 1వ తేదీన ఈ పర్వదినం రాబోతోంది. ఈ శుద్ధ ఏకాదశి రోజున ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనే వివరాల్లోకి వెళ్తే..
హిందూ పురాణాల ప్రకారం.. విష్ణువు ఆషాఢ మాసంలోని శుక్ల ఏకాదశి రోజున యోగా నిద్రలోకి వెళ్తాడు. అలా నాలుగు నెలల తర్వాత కార్తీకమాసంలోని ఉత్థాన ఏకాదశి రోజున నిద్రలో నుంచి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు. ఈ కాలం తర్వాత ధర్మం, కర్మ, పుణ్యం చైతన్యవంతం అవుతుందని భావిస్తారు. సాధారణంగానే ఒక నెలలో వచ్చే ఏకాదశిని పవిత్రంగా భావిస్తారు. అలాంటిది కార్తిక మాసంలో వచ్చే ఈ ఏకాదశి ఎంతో విశిష్టతను కలిగి ఉంది. అందువల్ల ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల శివకేశవులు ఇద్దరి ఆశీస్సులు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. మరి ఈరోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు ఇప్పుడు చూద్దాం.
శుద్ధ ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి రోజున ప్రాత అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానం చేసిన వెంటనే విష్ణువుకు పూజ చేయాలి. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల దైవానుగ్రహం ఉంది అవకాశం ఉంది. ఒకవేళ ఉపవాసం ఉంటే పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం పారాయణం చేయడం వల్ల స్వామివారి ఆశీస్సులు ఉంటాయని భావిస్తారు. రాత్రి దీపములు వెలిగించి విష్ణువుకు సమర్పించాలి. ఈరోజు ఉపవాసం ఉండేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. కోపం తెచ్చుకోకూడదు. రాత్రి వరకు నిద్రపోకుండా ఆధ్యాత్మిక చింతలలో ఉండాలి. మనసును అదుపులో ఉంచుకొని చెడు ఆలోచనలకు రానీయకుండా చేయాలి. నిత్యం విష్ణువులు స్మరించుకోవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.
శుద్ధ ఏకాదశి రోజున తులసి, శాలిగ్రామ వివాహం జరిపిస్తారు. ఇది కార్తీక మాసంలో శుభారంభముగా భావిస్తారు. పద్మ పురాణం ప్రకారం ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల గత జన్మలో ఉన్న పాపాలు తొలగిపోతాయని అంటారు. విష్ణువును నిద్రలేపే రోజు కావడంతో ఈరోజు ధ్యానం, జపం చేయడం వల్ల ఆ స్వామివారు భక్తులపై ఆశీస్సులు ఉంటాయని భావిస్తారు. అలాగే ఈరోజు పుణ్యకార్యాలు, వివాహాలు, దానధర్మాలు చేయడం మంచిది. వ్రతాలు చేయడం వల్ల కూడా అంతా శుభమే జరుగుతుందని భావిస్తారు.



































