ఇడ్లీ, దోసె,చపాతీ, పూరీ.. దేనికైనా ఇదే పర్ఫెక్ట్ సైడ్ డిష్!..నాలుకను కట్టిపడేసే టమోటా కుర్మా

తెలుగు వారి ఇళ్లలో ఉదయం పూట వేడివేడి ఇడ్లీలు, కరకరలాడే దోసెలు లేని బ్రేక్ ఫాస్ట్ ని ఊహించుకోవడం కష్టం. అయితే వాటికి తోడుగా రోజూ అవే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ తిని తిని బోర్ కొట్టిందా? అయితే టమోటా కుర్మా ఒక్కసారి ట్రై చేయండి.


ఈ కుర్మా రుచి మిమ్మల్ని కట్టిపడేస్తుంది. టమోటాల పులుపు, మసాలాల ఘాటు, జీడిపప్పు, కొబ్బరి మిశ్రమం అందించే చిక్కదనం అన్నీ కలిసి మీ నాలుకపై నాట్యం చేస్తాయి. ఇది కేవలం ఇడ్లీ, దోసెలకే కాదు చపాతీ, పూరీ, పరోటాలలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఘుమఘుమలాడే టమోటా కుర్మా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
జీడిపప్పు – 5
తాజా కొబ్బరి తురుము – అర కప్పు
పచ్చిమిర్చి – 2
దాల్చిన చెక్క – 1 అంగుళం ముక్క
యాలకులు – 1
లవంగాలు – 3
గసగసాలు – 1 టీస్పూన్
సోంపు – 1 టీస్పూన్
పండిన టమోటాలు – 4
నూనె – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు – కొద్దిగా
పుదీనా ఆకులు – కొద్దిగా
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
గరం మసాలా – 1 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు – అవసరాన్ని బట్టి

తయారీ విధానం

-ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో జీడిపప్పు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, గసగసాలు, సోంపు, టమోటాలు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి మారేంత వరకు సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి.

-ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులను వేసి మరో నిమిషం వేపాలి.

-ఇప్పుడు ముందుగా చేసుకున్న టమోటా మసాలా ముద్దను కుక్కర్‌ లో వేసి, నూనె పైకి తేలేంత వరకు ఓ రెండు మూడు నిమిషాలు బాగా వేయించాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలు మాడిపోకుండా ఒక నిమిషం పాటు బాగా కలపాలి.

-చివరగా మీకు కుర్మా కావలసిన చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టండి. మీడియం మంట మీద 2 విజిల్స్ రానివ్వండి.

-ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం పోయే వరకు వేచి ఉండండి. అంతే ఘుమఘుమలాడే, రుచికరమైన టమోటా కుర్మా రెడీ.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.