సప్తగిరులను తన ఆసనంగా చేసుకొని కొలువుదీరిన ఆ ఏడుకొండల స్వామి వైభవం వర్ణించేందుకు మాటలు చాలవు. రాజుల కాలం నుంచి నేటి వరకు ఎంతోమంది కానుకలుగా ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు సమర్పించారు. 12వ శతాబ్దం నుంచే రాజులు విశేష కానుకలు అందించారు
- ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయలు మొదలు దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు, ముస్లింల కాలంలోనూ స్వామికి ఆభరణాలు అందించారు.
- ఆభరణాలకు ప్రత్యేకంగా 21 రికార్డులను తితిదే నిర్వహిస్తోంది.
ఉత్సవాలకు ప్రత్యేకం
ఉత్సవాల్లో అలంకరణకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు ముఖ్యమైనవి. 2009లో గాలి జనార్ధనరెడ్డి రూ.42 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని శ్రీవారికి సమర్పించారు.
అది స్వర్ణయుగం
శ్రీకృష్ణదేవరాయలు పాలించిన 21 ఏళ్ల కాలంలో 1509- 1530 స్వామివారికి స్వర్ణ యుగమనే చెప్పాలి.
- 10.02.1513న కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటాన్ని సమర్పించారు.
- 02.05.1513న నవరత్న ఖచ్చిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చిన కటారి, రత్నకచిత ఓ చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు 30 తీగల పథకం కానుకగా ఇచ్చారు.
మతాలు, దేశాలకతీతం
- బ్రిటిష్ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా చేసిన థామస్ మన్రో ఓ పెద్ద గంగాళాన్ని కానుకగా స్వామి వారికి సమర్పించారు.
- అష్టదళ పాదపద్మారాధన పూజలో వాడే 108 బంగారు పుష్పాలను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అందించారు.
- అర్చనలో వినియోగించే 108 బంగారు పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మీరా అందజేసినట్లు చరిత్ర.
- గోయంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చారు.
- పెన్నా సిమెంట్స్ సంస్థ రూ 5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కటి, వరద హస్తాలు సమర్పించారు.
మరికొన్ని..
సువర్ణ పద్మపీఠం, సువర్ణపాదాలు, ఉదర బంధము, దశావతార హారం, బంగారు పులిగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజ కీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి ఆభరణాలున్నాయి.
ఆహార్యం ఆహా అనేలా కళాకారుల వస్త్రధారణ, వేషధారణ ఆకట్టుకుంటోంది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి అగ్రశ్రేణి కళాకారుల బృందాలు ప్రదర్శనలిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన కళలు, నృత్యాలను రక్తికట్టేలా.. కట్టూబొట్టు పెట్టి కాలు కదుపుతుంటే భక్తజనం సమ్మోహితులు అవుతున్నారు. సుమారు గంటపాటు వస్త్రధారణ, వేషధారణకు కళాకారులు సమయం వెచ్చిస్తున్నారు. మేకప్, వివిధ రకాల రంగులు, భంగిమలతో మాడవీధుల్లో నడుస్తూ ప్రదర్శలిస్తున్నారు. రోజుకో ప్రత్యేకతతో, రోజూ వాహనసేవల ముందు 19 బృందాలతో 380 సభ్యులతో సాగే ఈ సాంస్కృతిక ప్రదర్శనలు వారి ఆహార్యాలు, హావాభావాలు చూసేందుకు రెండు కనులూ చాలవంటే అతిశయోక్తి కాదు.































