ఈ ప్రపంచంలో ఎక్కువ మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ దూరం లేదా ఎక్కువ దూరమైనా కూడా ఈ రైలు (Train Journey) ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు.
ఎందుకంటే సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రపంచాన్ని చుట్టేయవచ్చనే ఉద్దేశంతో దీనినే ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కేవలం ఇండియాలోనే (India) కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న తప్పు వల్ల జరిగిన రైలు ప్రమాదాల్లో ఎందరో మరణిస్తున్నారు. భారత్‌లో ఇటీవల ఒడిస్సాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎందరో వారికి ఇష్టమైన వ్యక్తులను కోల్పోయారు. అయితే ఇలాంటి ప్రమాదాలతో పోలిస్తే.. ప్రపంచంలోనే అత్యంత ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 1700 మందికి పైగా మృతి చెందారు. ఇంతటి ఘోరమైన రైలు ప్రమాదం.. ఎక్కడ? ఎప్పుడు వచ్చింది? ఆ విషాద సంఘటన గురించి ప్రతీ ఒక్కరూ కూడా తెలుసుకోవాలి.
2004లో డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో పెద్ద సునామీ వచ్చింది. ఇది యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ భయంకరమైన సునామీ వల్ల ప్రకృతి దెబ్బతినడంతో పాటు ఎందరో మృతి చెందారు. శ్రీలంకలోని తీర ప్రాంతాలు అన్ని కూడా పూర్తిగా నాశనం అయ్యాయి. ఈ సునామీ వల్ల ఘోర రైలు ప్రమాదం జరిగింది. ది క్వీన్ ఆఫ్ ది సీ అనే రైలు సునామీ వల్ల కూలిపోయింది. దీంతో రైలులోని ప్రయాణికులు దాదాపు 1700 మందికి పైగా కూలిపోయారు. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం. సునామీ కారణంగా పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. దీంతో రైలు మొత్తం.. సముద్రంలో కొట్టుకుపోయింది. తెలవట్ట సమీపంలోని పెరాలియా వద్ద సౌత్ వెస్ట్ కోస్ట్ రైల్వే లైన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలు శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దక్షిణ నగరం గాలెకు వెళ్తుంది. ఈ క్రమంలో రైలులోని ఎనిమిది కోచ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
క్రిస్మస్ సమయం కావడంతో ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగింది. అలల ధాటికి రైలు బోగీలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా చనిపోయారు. దాదాపు 1700 మంది ఈ ప్రమాదంలో మరణించారు. అయితే ఈ రైలు ప్రమాదంలో 800 మంది వారివి మాత్రమే మృతదేహాలు లభించాయి. మిగిలిన మృతదేహాలు లభ్యం కాలేదు. ప్రపంచ చరిత్రలో ఇదే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం. అయితే ప్రపంచంలో రెండవ అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం భారతదేశంలోనే జరిగింది. 1981లో బీహార్‌లో ప్యాసింజర్ రైలు బోగీలు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్‌లో కూడా ఓ రైలు ప్రమాదం జరిగింది. ఇందులో దాదాపుగా 700 మంది మరణించారు. ఫ్రెంచ్ చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం.