కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదురుచూస్తున్నాయి.
అయితే 2025లో చోటుచేసుకునే పలు అంశాలకు సంబంధించి ఇప్పుడు చర్చ సాగుతుంది. అందులో ఒకటి 2025 ఏడాదిలో ఏర్పడనున్న 4 గ్రహణాలు. వైదిక జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. 2025లో ఏర్పడనున్న నాలుగు గ్రహణాలలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. రెండు సూర్య గ్రహణాలలో పాక్షికం కాగా.. రెండు చంద్ర గ్రహణాలు కూడా సంపూర్ణ గ్రహణాలు. ఈ గ్రహణాలు మార్చిలో రెండు, సెప్టెంబరులో రెండు ఏర్పడనున్నాయి.
అయితే నాలుగు గ్రహణాలలో ఒకటి మాత్రమే భారతదేశంలో కనిపిస్తుంది. 2025 సెప్టెంబరు 7 – 8న ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారత ప్రజలు వీక్షించే అవకాశం ఉందని ఖగోళ పరిశోధకులు వెల్లడించారు. దీంతో భారత ప్రజలకు అద్భుతమైన దృశ్యాలను చూసే పరిమిత అవకాశం మాత్రమే ఉంటుంది.
2025లో సూర్య, చంద్ర గ్రహణాలు..
1. సంపూర్ణ చంద్రగ్రహణం: మార్చి 13-14
2025లో ఏర్పడే మొదటి గ్రహణం సంపూర్ణ చంద్ర గ్రహణం. మార్చి 13 – 14 తేదీలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ గ్రహణం. ఇది ”బ్లడ్ మూన్” అని పిలువబడే విలక్షణమైన ఎరుపు రంగును ఇస్తుంది. కానీ ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం.. యూరప్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికాలలోని చాలా ప్రాంతాలలో కూడా ప్రజలు వీక్షించవచ్చు.
2. పాక్షిక సూర్యగ్రహణం: మార్చి 29
2025లో చంద్ర గ్రహణం ఏర్పడిన 15 రోజులకే సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం కూడా ఇదే. అయితే ఇది పాక్షిక సూర్య గ్రహణం మాత్రమే. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణాన్ని యూరప్, ఉత్తర ఆసియా, ఉత్తర/పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో ఎక్కువ భాగం, దక్షిణ అమెరికా ఉత్తర భాగంలోని పలు ప్రాంతాలలో వీక్షించవచ్చు.
3. సంపూర్ణ చంద్రగ్రహణం: సెప్టెంబర్ 7-8
ఈ ఏడాది ఏర్పడే మరో చంద్ర గ్రహణం సెప్టెంబర్‌లో చోటుచేసుకుంది. ఇది సంపూర్ణ గ్రహణం. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో ఈ గ్రహణం వీక్షించవచ్చు. అలాగే అమెరికాలోని పలు భాగాలు, హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత ప్రజలు వీక్షించవచ్చు. అందుకే దేశంలోని ఖగోళ శాస్త్ర ప్రియులు ఈ అద్భుత దృశ్యాన్ని మిస్ చేసుకోకండి.
4. పాక్షిక సూర్యగ్రహణం: సెప్టెంబర్ 21
సెప్టెంబర్ నెలలో చంద్ర గ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది ఈ ఏడాది ఏర్పడే రెండో సూర్య గ్రహణం కాగా.. ఇది కూడా పాక్షిక గ్రహణమే. అంటార్కిటికా, పసిఫిక్, అట్లాంటిక్, దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. అయితే ఇది భారతీయ వీక్షకులకు కనిపించదు.