కొలెస్ట్రాల్ కరిగించే ఉలవల కారంపొడి రెసిపీ, రోజుకు రెండు ముద్దలు దీంతో తినండి చాలు

ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కాలంలో ఉలవలను వాడే వారి సంఖ్య తగ్గిపోయింది. ఉలవలతో వంటకాలు కూడా ఎక్కువ మందికి రావడం లేదు. ఇక్కడ మేము సింపుల్ గా ఉలవల కారంపొడి రెసిపీ ఎలాగో ఇచ్చాము.


దీన్ని ఒకసారి పొడి చేసి దాచుకుంటే ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది. ప్రతిరోజు రెండు ముద్దలు ఈ ఉలవల కారం పొడి వేసుకొని తినేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఉలవల కారంపొడి రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉలవలు – 200 గ్రాములు

ఉప్పు – రుచికి సరిపడా

శనగపప్పు – ఒకటిన్నర స్పూను

మినప్పప్పు – ఒకటిన్నర స్పూను

ఎండుమిర్చి – 20

వెల్లుల్లి రెబ్బలు – 10

చింతపండు – చిన్న ఉసిరికాయ సైజులో

ఉలవల కారంపొడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి ఉలవలను వేసి బాగా వేయించాలి. మాడిపోకుండా చూసుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు అదే కళాయిలో మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి.

3. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి.

4. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేయాలి.

5. అలాగే ఉలవలను కూడా వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి పొడి లాగా చేసుకోవాలి.

6. దీన్ని గాలి చొరబడిన డబ్బాల్లో వేసి దాచుకోవాలి.

7. మీకు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు రెండు ముద్దలు ఈ ఉలవల కారంపొడి వేసుకొని తింటే మంచిది. చిటికెడు నెయ్యి కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

8. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒక్కసారి దీన్ని వండి చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

ఉలవలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కిడ్నీలో వచ్చే రాళ్ల సమస్య నుంచి ఈ ఉలవలు బయటపడేస్తాయి. ఆరోగ్య నిపుణులు కూడా ఉలవలను అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోమని చెబుతూ ఉంటారు. వీటిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మలబద్ధకం, గ్యాస్టిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఉలవలను తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. పూర్వకాలంలో ఉలవలతో ఉలవచారును వండుకునేవారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది. కానీ ఇప్పుడు ఈ వంటకం ఎంతో మంది మర్చిపోయారు. అందుకే ఇక్కడ మేము సులువుగా చేసుకునే ఉలవల కారంపొడి రెసిపీ ఇచ్చాము. దీన్ని వారానికి కనీసం ఐదారు సార్లు తినేందుకు ప్రయత్నించండి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి అత్యవసరమైనవి.