పిల్లలకు భరించలేని హింస.. పేరెంట్స్‌, టీచర్ల దెబ్బకు టీనేజ్‌లోనే మెంటల్‌ టార్చర్

ఇప్పుడు పిల్లల జీవితంలో గడియారం ముల్లు చాలా వేగంగా తిరుగుతోంది. 16ఏళ్ల వయసులో ఒక నిర్ణయం తీసుకుని 30 ఏళ్ల వరకు దానితోనే జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా స్కూల్ చదువు పూర్తి కాకముందే భవిష్యత్తు డెడ్‌లైన్‌లు మొదలవుతున్నాయి. ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఏ కోర్సు ఎంచుకోవాలి, ఏ జాబ్ మార్కెట్‌లో నిలబడాలన్న ప్రశ్నలు టీనేజ్‌ వయసులోనే భుజాల మీద పడుతున్నాయి.


బయట నుంచి చూస్తే ఇదంతా అవకాశాల ప్రపంచంలా కనిపిస్తుంది. ఏఐ ఉంది, టెక్నాలజీ ఉంది, కొత్త రంగాలూ ఉన్నాయి. అయితే విద్యార్థుల మనసుల లోపల మాత్రం అంతా టెన్షన్ టెన్షన్. ఇప్పుడే తప్పు చేస్తే భవిష్యత్తు పాడవుతుందేమో అనే భయం, వెనుకబడిపోతామేమో అనే ఆందోళన వారిది. ప్రతి ఎగ్జామ్ ఒక ఫైనల్ జడ్జ్‌మెంట్‌లా మారిపోతోంది. ఈ ఒత్తిడి చదువుకే పరిమితం కావడం లేదు. అది నిద్రను, ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ఆరోగ్యాన్ని తాకుతోంది. అసలు ఈ తొందర ఎవరి కోసం? పిల్లల భవిష్యత్తును ఇంత చిన్న వయసులోనే ఫిక్స్ చేయాల్సిన అవసరం నిజంగా ఉందా? లేదా మనమే ఒక తరం మీద మోయలేని భారం మోపుతున్నామా?

ఈ ఆందోళన ఊహ కాదు. ఇది సంఖ్యల్లో కనిపిస్తున్న వాస్తవం. ఐక్యరాజ్యసమితి అధ్యయనం ప్రకారం, భారత్‌లో ఉన్న విద్యార్థుల్లో కేవలం 10 శాతం మందికే సరైన కెరీర్ గైడెన్స్ అందుతోంది. మిగతా 90 శాతం మంది కుటుంబ సూచనలు, సమాజ ఒత్తిడి, స్నేహితుల ఎంపికలు, సోషల్ మీడియాలో కనిపించే విజయ కథల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా మంది పిల్లలు చీకట్లో నడుస్తున్నారు. ఇంకో గణాంకం మరింత ఆందోళన కలిగిస్తుంది. 2025లో జరిగిన జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం, భారత టీనేజర్లలో సుమారు 45 శాతం మంది నిరంతర ఆందోళన, మోటివేషన్ లోపం, నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు.

ఈ సమస్యలకు అకడమిక్ ఒత్తిడితో పాటు భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితి ప్రధాన కారణాలగా నిపుణులు చెబుతున్నారు. చదువు పూర్తికాకముందే కెరీర్ భయం మొదలవుతోంది. ఒకప్పుడు డిగ్రీ అయ్యాక కెరీర్ మార్గాలు తెరుచుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. మిడిల్ స్కూల్ దశలోనే సైన్స్ లేదా నాన్-సైన్స్ అనే లేబుల్ పడుతోంది. ఇంటర్మీడియట్ దశలోనే జీవితం ఒకే దారిలో లాక్ అయిపోతోంది. ఇలా కెరీర్ ఎంపికపై ఒత్తిడి ఎక్కువైన కొద్దీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, తప్పు చేసిన భయం పెరుగుతుంది.

ఈ ఒత్తిడిని మరింత పెంచుతున్న అంశం కుటుంబ అంచనాలు. స్థిరత్వం పేరుతో ఇంజినీరింగ్, మెడిసిన్, కామర్స్ లాంటి రంగాల వైపు పిల్లలను నెట్టేస్తున్నారు. ఉద్దేశం మంచిదే అయినా ఫలితం మాత్రం భారంగా మారుతోంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. తమ ఆసక్తికి విరుద్ధంగా కెరీర్ ఎంచుకున్న విద్యార్థుల్లో ఆందోళన స్థాయి సుమారు 30 నుంచి 40 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. అంటే నిర్ణయం తప్పైతే దాని ప్రభావం కేవలం ఉద్యోగంపైనే కాదు, మానసిక ఆరోగ్యంపైన కూడా పడుతోంది.

మరోవైపు టెక్నాలజీ మరో కొత్త భయాన్ని తెచ్చింది. ఏఐ, ఆటోమేషన్, జాబ్ మార్కెట్ మార్పులపై నిరంతర చర్చలు జరుగుతున్నాయి. దీని వల్ల విద్యార్థులు ఒక రంగం ఎంచుకోవడమే కాదు, ఆ రంగం ఐదేళ్ల తర్వాత ఉంటుందా లేదా అన్న భయంతో కూడా జీవిస్తున్నారు. అందుకే చాలామంది ఆసక్తి కంటే బెనిఫిట్‌గా కనిపించే రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది తాత్కాలిక భద్రత ఇస్తోంది కానీ లాంగ్‌ టర్మ్‌లో సంతృప్తిని ఇవ్వడం లేదు.

నిజానికి కెరీర్ అనేది ఒకసారి తీసుకునే తీర్పు కాదు. అది మారుతూ ఉండే ప్రయాణం. అందుకే స్కూల్స్, కాలేజీలు ఇప్పుడు మెల్లగా మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్, కెరీర్ కౌన్సెలింగ్‌పై దృష్టి పెడుతున్నాయి. విద్యార్థులకు నిర్ణయం తీసుకునే ముందు పరిశోధనకు అవకాశం ఇవ్వడం ఒత్తిడిని భారీగా తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి మనం పిల్లలను ముందుకు నడిపిస్తున్నామా? లేక మన భయాలను వాళ్ల భుజాల మీద పెడుతున్నామా అన్నది పేరెంట్స్ కచ్చితంగా ఆలోచించుకోవాలి.

కెరీర్ అంటే జీవితం అంతా ఒకే ట్రాక్‌లో పరుగెత్తడం కాదు. అది నేర్చుకుంటూ, మారుతూ, ఎదుగుతూ వెళ్లే ప్రయాణం. ఆ నిజాన్ని మనం అర్థం చేసుకున్న రోజే ఈ కొత్త తరం మీద ఉన్న ఆందోళన కొంతైనా తగ్గుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.