అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వీసాను ఆవిష్కరించారు. విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి ఉద్దేశించినది.
అమెరికా ట్రెజరీకి మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం ద్వారా ఈ వీసాను పొందవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే వెబ్‌సైట్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఇది కూడా గ్రీన్ కార్డ్ లాంటిదేనని, దానికంటే గొప్ప ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
వ్యక్తిగత, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ వీసాల దరఖాస్తులు ప్రస్తుతం ప్రభుత్వ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. వ్యక్తులు/కంపెనీలు దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డ్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ఇది ఉపయోగపడుతుందని, అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తమ వద్దే నిలుపుకోవాలనుకునే వారికి ఓ చక్కని అవకాశమని అన్నారు. ఉన్నత విద్యా సంస్థల నుండి పట్టభద్రులు, ప్రతిభావంతులను స్పాన్సర్ చేయడానికి, వారిని అమెరికాలో ఉంచుకోవడానికి ఆయా కంపెనీలకు వీలు కలుగుతుందని వివరించారు.
వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్, స్టెర్న్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్, మస్సాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి విద్యా సంస్థలకు చెందిన ఉన్నత విద్యాసంస్థలకు చెందిన గ్రాడ్యుయేట్లను స్పాన్సర్ చేయవచ్చని తెలిపారు. గోల్డ్ కార్డ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రావాలని ఆపిల్ వంటి సంస్థలు కూడా ఒత్తిడి తెచ్చాయని అన్నారు. ఆ సంస్థ అధినేత టిమ్ కుక్ దీని గురించి తనతో అనేకసార్లు మాట్లాడారని ట్రంప్ పేర్కొన్నారు.
గోల్డ్ కార్డ్ దరఖాస్తుదారులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కు 15,000 డాలర్ల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. ఇది- నాన్ రీఫండబుల్. ఆ వెంటనే ఆయా దరఖాస్తులన్నీ కూడా ప్రాసెస్ అవుతాయి. దీని తర్వాత దరఖాస్తుదారులు అమెరికా ప్రభుత్వానికి ఒక మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ ద్వారా కార్పొరేట్ కంపెనీలు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను స్పాన్సర్ చేయవచ్చు. ప్రతి ఉద్యోగికి రెండు మిలియన్ డాలర్లను చెల్లించాలి. ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది.
ఇదే మొత్తంతో ఆయా కంపెనీలు మరో కొత్త ఉద్యోగికీ బదిలీ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మళ్లీ రెండు మిలియన్ డాలర్లను చెల్లించనక్కర్లేదు. బదిలీ చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక శాతం మేనేజ్మెంట్ ఫీ, అయిదు శాతం ట్రాన్స్ ఫర్ ఫీ చెల్లించాలి. భారత్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల నుండి వచ్చిన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లు తమ చదువులను పూర్తి చేసిన అనంతరం దేశం విడిచి వెళ్లకుండా నిరోధించే ఉద్దేశ్యంతో గోల్డ్ కార్డ్‌ను రూపొందించినట్లు ట్రంప్ వివరించారు. ఇది ఇప్పటివరకు అమలు చేసిన బెస్ట్ వెట్టింగ్ గా అభివర్ణించారు.

































