బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. పోషకాలను నిలయం బీట్ రూట్ అని చెప్పొచ్చు. అయితే ఈ దుంప రుచి నచ్చదని చాలా మంది తినరు. అలాగే కలర్ కూడా బ్రైట్‌గా కనిపించే సరికి..
పిల్లలు తినడానికి మారం చేస్తారు. కానీ శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఇందులో లభిస్తాయి. ముఖ్యంగా నైట్రేట్స్ లభిస్తాయి. బీట్ రూట్ తింటే డయాబెటీస్, క్యాన్సర్, బీపీ, థైరాయిడ్, చర్మ సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. బీట్ రూట్‌ను తరచుగా తీసుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతాయి. బీట్ రూట్ తినని వారు.. ఇలా వడలు కూడా చేసి పెట్టొచ్చు. ఇవి ఎంతో కలర్ ఫుల్‌గా కనిపిస్తాయి. అలాగే రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలు కూడా తింటారు. మరి ఈ బీట్ రూట్ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
బీట్ రూట్ వడలకు కావాల్సిన పదార్థాలు:
బీట్ రూట్, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, చనగ పప్పు, బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు, ఆయిల్.
బీట్ రూట్ వడలు తయారీ విధానం:
ముందుగా చనగ పప్పును శుభ్రంగా కడిగి వేడి నీళ్లు వేసి ఓ రెండు గంటల పాటు అయినా నానబెట్టాలి. ఆ తర్వాత ఈ పప్పును కొద్దిగా పక్కన పెట్టి.. మిగతా పప్పు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు మిక్సీలో వేసి కచ్చా పచ్చా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఓ గిన్నెలోకి తీసుకుని.. మిగిలిన చనగ పప్పు, బీట్ రూట్ తురుము, బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ లోపు స్టవ్ మీద ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక.. వడలు వేసి రెండు వైపులా వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ వడలు సిద్దం.