విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నవంబరు 15 నుంచి ప్రారంభమయ్యే ఇండిగో విమాన సర్వీసుకు టికెట్ ధర రూ.8 వేలు. సింగపూర్ నుంచి బయలుదేరి ఉదయం 7.45కు ఈ సర్వీసు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి తిరిగి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి సింగపూర్‌కు వెళుతుంది. విజయవాడ నుంచి సింగపూర్‌కు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది. భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.05కు సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయానికి ఈ సర్వీసు చేరుకుంటుంది.
ఇప్పటికే టికెట్ల అమ్మకాలు ఆరంభమయ్యాయి. ఈ అంతర్జాతీయ విమాన సర్వీసు మంగళ, గురు, శనివారాల్లో ఉంటుంది. 180 నుంచి 230 సీటింగ్ ఉన్న బోయింగ్ సర్వీసులను విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో సంస్థ నడపనుంది. తొలుత వారంలో మూడురోజులు నడిపి.. రద్దీని బట్టి తర్వాత రోజువారీగా నడిపే యోచనలో సంస్థ ఉంది. 2018 డిసెంబరు నుంచి 2019 జూన్ మధ్య విజయవాడ నుంచి సింగపూర్‌కు సర్వీసును నడిపిన సమయంలో కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే.. ఇటు నుంచి 80 శాతం, సింగపూర్ నుంచి వచ్చే సర్వీసు 90 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.




































