వైకాపా పెద్దల అండతో ఇష్టారాజ్యం కన్నూమిన్ను కానరాకుండా చెలగాటం
అరెస్టుతో పరిస్థితి దయనీయం
ఒంగోలు స్టేషన్ నుంచి విజయ్‌పాల్‌ను గుంటూరు తరలిస్తున్న పోలీసులు
సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ పొందినా.. అందులోనే ఓఎస్డీ పోస్టును వైకాపా ప్రభుత్వం ఆయనకు కట్టబెట్టింది. అదే అదనుగా అప్పటి అధికార పెద్దల అండదండలతో కన్నూమిన్ను కానరాకుండా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. తనకు సముచిత స్థానమిచ్చిన వారికి వ్యతిరేకంగా గళమెత్తడాన్నీ సహించలేకపోయారు. చట్టాలను తుంగలో తొక్కారు. ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేశారు. తమ అధినేతల కళ్లలో ఆనందం కోసం పేట్రేగిపోయారు. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత కేసులో చిక్కుకుని చివరికి జైలు’పాల్’ అయ్యారు.
నిందితుడిగా.. చివరికి బేలగా మారి…: ఎస్సై, సీఐ, డీఎస్పీగా మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులో ఎన్నో వేల కేసులు నమోదు చేసి ఉంటారు రావెల విజయ్‌పాల్. అంతకుమించిన సంఖ్యలో నేరగాళ్లను విచారించి ఉంటారు. గత వైకాపా పాలనలో సీఐడీ విభాగం అదనపు ఎస్పీగా, ఓఎస్డీగా ఎంతోమందిని వివిధ కేసుల్లో అరెస్టు చేశారు. చివరికి అప్పటి అధికార పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలోనూ తాడేపల్లి ప్యాలెస్ ఆడమన్నట్లల్లా ఆడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను చిత్రహింసలు పెట్టిన కేసులో తానే నిందితుడి మారారు. సీఐడీ అదనపు ఎస్పీగా రఘురామపై నమోదైన కేసులో దర్యాప్తు అధికారిగా ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే కేసులో తాను ఇరుక్కుని నిందితుడిగా పోలీసు స్టేషన్‌లో చాపపై పడుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు.
విశ్రాంతి లేదు.. ప్రశాంతత కరవు…: జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం విజయ్‌పాల్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక గదిలో ఆయనొక్కడే పోలీసు పహారా మధ్య గడపాల్సి వచ్చింది. అదే పోలీసు శాఖలో ఒకనాడు దర్పం ఒలకబోసిన వ్యక్తి గంటల తరబడి ఎవరితో మాట్లాడే అవకాశం లేకుండా శూన్యంలోకి చూస్తూ భవిష్యత్తుపై బెంగతో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వచ్చింది.
ఒకనాడు దర్యాప్తు అధికారిగా వందల మందిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఆ పోలీసు అధికారి.. ఇప్పుడు అదే శాఖలోని అధికారుల ఎదుట చేతులు కట్టుకుని ప్రశ్నలకు తడబడుతూ సమాధానాలు ఇవ్వాల్సిన దయనీయ స్థితిని ఎదుర్కొన్నారు. పోలీసు స్టేషన్‌లో ఒక రాత్రంతా బందీగా ఉన్నారు. నాటి అధికార పార్టీతో అంటకాగి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఫలితంగా.. ఆ అధికారి ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఇప్పుడు ప్రశాంతమైన జీవితం కరవైంది. నిబంధనలను తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందనేందుకు విజయ్‌పాల్ ఓ ప్రత్యక్ష ఉదాహరణ అనే చర్చ పోలీసు శాఖలో ఇప్పుడు సాగుతోంది.