Viral Video : ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. ఇన్ని వేరియేషన్స్‌.. ఇలా బౌలింగ్‌ చేస్తే ప్రపంచకప్‌లు అన్నీ మనవే?

సాధారణంగా ఒక్కొ బౌలర్‌కు ఒక్కొరకమైన బౌలింగ్ యాక్షన్ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తీసుకున్నట్లయితే.. జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా వంటి బౌలర్ల శైలి మిగతా బౌలర్ల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది.
కాగా.. టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, ఆఫ్ స్పిన్నర్‌ను ఓ బౌలర్ యాక్షన్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. అంతేకాదు అతడికి తాను ఫ్యాన్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎవరా బౌలర్‌? అశ్విన్‌ను ఇంప్రెస్ చేసేంతగా అతడు ఎలా బౌలింగ్ చేశాడు? అన్న సంగతి సంగతి ఇప్పుడు చూద్దాం.


అతడి పేరు కే బాలాజీ. అతడు ఓ మీడియం పేసర్. తమిళనాడులో జరుగుతున్న ఎస్ఎస్ రాజన్ టీ20 టోర్నమెంట్‌లో అతడు.. ఓవర్‌లోని ఆరు బంతులను ఆరు రకాలుగా విసిరాడు. తిరువవూరు, తిరుపత్తూర్ మధ్య సేలం వేదికగా ఓ మ్యాచ్ జరిగింది. 18వ ఓవర్‌ను బాలాజీ వేశాడు. ఒక్కో బంతిని ఒక్కో రకమైన బౌలింగ్ యాక్షన్‌తో వేశాడు.
తొలి బంతిని చాహల్ మాదిరిగా వేసిన అతడు రెండో బంతిని బుమ్రా మాదిరి రనప్‌తో వచ్చి వేశాడు. మూడో బంతిని ఓవర్ ది వికెట్ వచ్చి సగం బాడీని కిందకు వంచి పరిగెత్తుగా వచ్చి వేశాడు. నాలుగో బంతిని రెండు చేతులను చాపుతూ, ఐదో బంతిని సాధారణ మీడియం పేసర్ మాదిరిగా, ఆరో బంతి కుడి చేతిని పూర్తిగా పైకెత్తి రనప్‌లో వచ్చి వేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసి ‘బాలాజీ ఈజ్ మై న్యూ అడిక్షన్’ అంటూ రాసుకొచ్చాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదెక్కడి బౌలింగ్ రా బాబు.. ఇన్ని రోజులుగా ఎక్కడ ఉన్నావ్, ఇలా బౌలింగ్ చేస్తే ప్రపంచకప్‌లు అన్నీ మనవే అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.