తిరుమల దర్శనాలు ఇక ఈజీ.. భక్తులకు ఇదో గొప్పఊరట

సాధారణంగా తిరుమల లో (Tirumala) శ్రీవారి దర్శనం అంటేనే గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. ముందస్తు ఆన్లైన్ టిక్కెట్లు పొందినా..


దర్శనం కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది. అందుకే నెలల తరబడి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కొందరు. అయితే ఇటీవల భక్తుల రద్దీ పెరగడంతో ఆ ప్రభావం దర్శనాలపై పడుతోంది. గంటల తరబడి జాప్యం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. కమాండ్ విధానంతో దర్శనాలను వేగవంతం చేసింది. గంటలకు నిరీక్షణకు చెక్ పెట్టింది. స్లాట్ విధానంతో సులువుగా స్వామి వారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించింది. అందుకే ఇప్పుడు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినా.. పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. మొన్న వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఒకేసారి లక్షలాదిమంది భక్తులు వచ్చారు. కానీ ఎక్కడ తోపులాటలు, గలాటాలు చోటు చేసుకోలేదు. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడమే. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశా నిర్దేశం చేయడం వల్లే ఇది సాధ్యమైంది.

* అంతా ఒక పద్ధతిలో..
సాధారణ రోజుల్లోనే భారీగా భక్తులు తరలివస్తారు. అటువంటిది ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు అధిక సంఖ్యలోనే ఉంటారు. అయితే ఈ ఏడాది 70 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసింది టీటీడీ( Tirumala Tirupati Devasthanam). అందుకు తగ్గట్టుగా స్మార్ట్ విధానాన్ని అమలు చేసింది. భక్తులు ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ఏ సమయానికి రావాలి? అనే సమాచారాన్ని భక్తులకు ముందే మెసేజ్లు పంపించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి నాడు 67 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ మరుసటి రోజు కూడా అంతే సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే భక్తుల రద్దీ పెరిగినా స్లాట్ విధానంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిపోయింది.

* స్లాట్ బుకింగ్ సక్సెస్..
తిరుమలలో స్లాట్ బుకింగ్ ( slot booking) సక్సెస్ అయ్యింది. మిగతా రోజుల్లో సైతం ఇదే తరహా విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీనివల్ల నిర్దేశించిన సమయానికి భక్తులు చేరుకోగలిగారు. 98 శాతం మంది భక్తులు తమకు కేటాయించిన స్లాట్ సమయానికి రిపోర్ట్ చేశారు. అయితే నాలుగు గంటలకు మించి ఏ భక్తుడు కూడా క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే చాలామందికి గంటన్నర నుంచి రెండు గంటల్లోనే దర్శనం పూర్తయింది. రోజులో 3 ప్రాంతాలను అంటే.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రిపోర్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో యు లైన్లో నిర్వహణ కూడా సులభంగా మారింది. పూర్తి టెక్నాలజీతో ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. టికెట్ జారీ ప్రక్రియ నుంచి లగేజ్ డిపాజిట్, బాడీ స్కానింగ్.. ఇలా అన్ని అంశాలను రియల్ టైం డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధానం ఉంది. ఆలయంలో దాదాపు 300కు పైగా సీసీ కెమెరాలు, 42 ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఉన్నాయి. క్యూలైన్లలో ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే ఆన్లైన్ ద్వారా గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. రేపటి నుంచి సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించనున్నారు. అయితే ఇదే విధానాన్ని అనుసరించి ముందుకెళ్లాలని టీటీడీ నిర్ణయించడం విశేషం. మునుపటి మాదిరిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా స్వామివారి దర్శనం కలగనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.