మార్నింగ్ నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా బిజీ బిజీగా గడిపేస్తుంటారు చాలామంది. ఇటు కుటుంబ బాధ్యతలు, అటు కెరీర్ పరంగా ఎదురయ్యే సవాళ్ల నడుమ సతమతం అవుతుంటారు.
కొన్ని ప్రాబ్లమ్స్ కామనే అయినప్పటికీ కొందరు మరీ భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. దీనివల్ల నిరుత్సాహం, నిరాశ ఎదురవుతుంటాయి. క్రమంగా ఫిజికల్ హెల్త్‌పై కూడా ఎఫెక్ట్ చూపుతుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసి మిమ్మల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా సహాయపడే టిప్స్ కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం.
ఫిజికల్ యాక్టివిటీస్
క్రమం తప్పకుండా వ్యాయామాలు లేదా ఏదో ఒకరకమైన ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండటం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో చేసే వర్కౌట్స్ మాత్రమే కాకుండా వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, మెడిటేషన్ వంటివి డైలీ అరగంట ప్రాక్టీస్ చేస్తే బీజీ లైఫ్ నుంచి బిగ్ రిలీఫ్ పొందుతారని నిపుణులు సూచిస్తు్న్నారు.
ఎమోషనల్ కంట్రోలింగ్
భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం అనేక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా కోపం, ఆవేశం, అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు అధికం అవుతాయి. వాటిని అధిగమించి మీరు ఉత్సాహంగా ఉండటంలో యోగా అద్భుతంగా సహాయపడుతుందని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ కొంతసేపు ప్రాక్టీస్ చేస్తే మీలోని ప్రతికూల భావాలు తగ్గుతాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి.
కాసేపు ఒంటరిగా..
ఒంటరి తనం వేరు.. ఒంటరిగా కాసేపు గడపడం వేరు. ఒంటరి తనం మానసిక సమస్యలకు దారితీయవచ్చు. కానీ అప్పుడప్పుడు ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో కాసేపు ఒంటరిగా కూర్చొని రిలాక్స్ అవ్వడం మీకు మేలు చేస్తుంది. అలా నిశ్శబ్ద వాతావరణంలో మీకు మీరు మనసులో ప్రశ్నించుకోవడం, మాట్లాడుకోవడం, లోతుగా ఆలోచించడం చేస్తారు. దీనివల్ల మీరు ఎదర్కొనే సమస్యకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు వంటివి దూరం అవుతాయి. కాబట్టి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే రోజూ ఉదయం లేదా సాయంకాలం కాసేపు మీకంటూ సమయం కేటాయించుకోండి. ఉదయమో, సాంయత్రమో నిశ్శబ్దంగా ప్రకృతిని ఆస్వాదించండి.
నాణ్యమైన నిద్ర :
చాలా సమస్యలు నిద్రలేమితో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు మీ పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. ప్రొడక్టివిటీ తగ్గవచ్చు. దీర్ఘకాలంపాటు నిద్రలేమిని ఎదుర్కొనేవారు మానసిక, శారీరక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువ. కాబట్టి మీరు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఏ సమయంలో నిద్రపోయినా అది నాణ్యమైనదిగా ఉండే వాతావరణం క్రియేట్ చేసుకోవడం బెటర్.
పాజిటివ్ థింకింగ్
మీ ఆలోచన ఎలా ఉంటే చాలా విషయాలు అందుకు అనుగుణంగానే జరిగే అకాశం ఉంటుంది అంటారు నిపుణులు. కాబట్టి వీలైనంత వరకు ప్రతీ విషయంలో సానుకూలంగా ఉండేలా చూసుకోండి. సానుకూల ఆలోచనలు మీలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రతి కూల ఆలోచనలు ఎక్కువైతే నిరాశ, నిస్పృహలకు దారితీస్తాయి. కాబట్టి పాజిటివ్‌గా ఆలోచించడం, పాజిటివ్‌గా అలవాటు చేసుకుంటే మీ జీవితం కూడా ఎక్కువగా అదే మార్గంలో సాగే చాన్స్ ఉంటుందని సైకాలజిస్టులు అంటున్నారు.
కృతజ్ఞతగా ఉండటం..
మనం హ్యాపీగా ఉంటున్నామంటే అందుకు బయటి పరిస్థితులు, వ్యక్తులు, ప్రకృతి, వనరులు ఇలా అనేక కారణాలు ఉంటాయి. అందుకే మీరు వాటన్నింటిపట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలంటారు నిపుణులు. ఇలా ఉండటం మీలో స్వీయ ఆనందానికి దారితీస్తుంది. మీకు మేలు చేసిన వ్యక్తులను, పరిసరాలను, పరిస్థితులను సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసుకోవడం, కృతజ్ఞతగా ఫీలవడం మీలో హ్యాపీ హార్మోన్ల విడుదలకు కారణం అవుతుంది. మీలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుంది.

































