రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం అభిమానులను, సగటు సినీ ప్రేక్షకులను తీవ్ర నిరాశలో ముంచెత్తింది. దర్శకుడు మారుతి రూపొందించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులు, ఫ్యాన్స్ అంచనాలను చేరుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకోకపోవడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించింది. సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమా కొంత మేరకు ప్రభావం చూపించినప్పటికీ.. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి చేర్చలేకపోయిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఈ సినిమా కలెక్షన్లు ఎంత? ఏ మేరకు వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సిబుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ది రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఫాంటసీ, హారర్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాలతో ఈ చిత్రం జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది.
కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరంగా రికార్డు క్రియేట్ చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్‌ను 207 కోట్ల మేర వాల్యూ చేశారు. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే కనీసం 210 కోట్ల రూపాయలు నెట్, 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ది రాజా సాబ్ గత 11 రోజుల్లో సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ చిత్రం 32 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 10 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5.5 కోట్లు, గుంటూరు జిల్లాలో 5.3 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 5.5 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 80 కోట్ల రూపాయల నెట్, 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో ఈ చిత్రం 11 రోజుల్లో దాదాపు 15 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తమిళనాడులో 3 కోట్లు, హిందీలో 30 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దాంతో ఇండియాలో ఈ చిత్రం 170 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 210 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తే.. చిత్ర యూనిట్ 238 కోట్ల రూపాయలు అని అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం వల్ల చాలా సంఖ్యలో థియేటర్ల నుంచి మూవీని ఎత్తివేశారు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను అంతంత మాత్రంగానే రాబట్టే అవకాశం ఉంది. 12వ రోజు అంటే బుధవారం ఈ సినిమా సుమారుగా 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టంగానే కనిపిస్తున్నది. ప్రస్తుతం ఈ చిత్రం థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్‌గా 200 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.




































